నాహం కర్తాః హరిః కర్తా తత్పూజా కర్మ చాఖిలం తదాపి మత్కృతా పూజా తత్ప్రసాదేన నా అన్యథా

Jul 29, 2008

తిరువీధుల మెరసీ దేవదేవుఁడు

శ్రీరాగం
తిరువీధుల మెరసీ దేవదేవుఁడు
గరిమల మించిన సింగారములతోడను. IIపల్లవిII

తిరుదండెలపైనేఁగీ దేవుఁడిదే తొలునాఁడు
సిరుల రెండవనాఁడు శేషునిమీఁద
మురిపేన మూఁడోనాఁడు ముత్యాలపందిరిక్రింద
పొరి నాలుగోనాఁడు పువ్వుఁగోవిలలోను. IIతిరుII

గక్కన నయిదవనాఁడు గరుడునిమీఁదను
యెక్కెను ఆరవనాఁడు యేనుగమీఁద
చొక్కమై యేడవనాఁడు సూర్యప్రభలోనను
యిక్కువఁ దేరును గుఱ్ఱమెనిమిదోనాఁడు. IIతిరుII

కనకపుటందలము కదిసి తొమ్మిదోనాఁడు
పెనచి పదోనాఁడు పెండ్లిపీఁట
యెనసి శ్రీ వేంకటేశుఁడింతి యలమేల్మంగతో
వనితల నడుమను వాహనాలమీఁదను. IIతిరుII ౭-౧౯౨

అన్నమయ్య బ్రహ్మోత్సవాల్లో శ్రీవేంకటేశ్వరుడు తిరువీధులలో ఊరేగే క్రమాన్ని తెలియజేస్తున్నాడు.
గొప్పతనములతో మించిన సింగారాలతో దేవదేవుడు తిరువీధులలో తిరిగేడీ విధంగా.
మొదటి రోజు పల్లకీ బొంగులమీద దేవుడూరేగాడు.రెండవనాడు లక్షీదేవితో శేషునిమీద ఊరేగాడు.మురిపెంగా మూడోరోజు ముత్యాల పందిరిక్రింద ఊరేగాడు.క్రమముగా నాలుగవరోజు పుష్ప వాహనం మీద ఊరేగాడు.గక్కన ఐదవనాడు గరుడునిమీద ఊరేగాడు.ఆరవనాడు ఏనుగెక్కి ఊరేగాడు.ఏడవరోజు సూర్యప్రభ వాహనంలో అందంగా ఊరేగాడు.ఎనిమిదో రోజు అశ్వ వాహనంమీద ఊరేగాడు.బంగారు తేరుమీద తొమ్మిదోనాడు ఊరేగింపుగా వెళ్ళాడు.పదోరోజు పెండ్లిపీట మీద కూర్చున్నాడు.శ్రీవేంకటేశ్వరుడీవిధంగా పది రోజుల్లో పది వాహనాలమీద తిరువీధుల్లో యింతి అలమేల్మంగతో కలసి ఊరేగాడు.ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాల్లో నేటికీ ఈ ఊరేగింపులు ఆవిధంగానే జరుగుతూ వస్తున్నాయి.టివి ప్రత్యక్ష ప్రసారాల కారణంగా ఈ వైభవాన్ని మనం మన యిండ్లల్లో కూర్చునే చూడగలుగుతున్నాం.అంతే కాదు.ఈ ఊరేగింపులతో పాటుగా ప్రసారమయ్యే అన్నమయ్య అందమైన సంకీర్తనలను మధురమైన స్వరాలతో ప్రముఖ సంగీతకారులు గానం చేస్తుంటే ఆ ఉత్సవ సంబరాలను తిలకించటం అదో భాగ్యంగా అనిపిస్తుంది నామటుకు నాకు.

4 comments:

సుజాత వేల్పూరి said...

బాలకృష్ణ ప్రసాద్ గారు పాడిన ఈ సంకీర్తన నాకు ఎంతో ఇష్టమైనది. మీ వివరణ, వర్ణన కూడా చాలా బాగుంది. ధన్యవాదాలు.

Sujata M said...

మీ దగ్గర 'ఓహో! ఎంతటి వాడే హరి! సాహస గుణముల చెలమరా ఇతడు ' అన్న పాట ఉంటే దయచేసి త్వరగా పోస్ట్ చెయ్యగలరు. నాకు ఈ పాట సాహిత్యం కాస్త కావాలి. థాంక్యూ !

చిలమకూరు విజయమోహన్ said...

అన్నమయ్య కీర్తనలను శోభారాజు గారి గొంతులోనే వినాలండి భగవంతున్నే మన ముందుకు తీసుకువస్తారు

Unknown said...

సుజాత గారూ ఈ పాటేనా కాకుంటే చెప్పండి.
విజయమోహన్ గారూ నిజమే.కాని ఎవరి పాటల అందం వారిది.అనుకుంటే వివాదాలు ఉండవుగా.ఏమంటారు?

ధర్మో రక్షతి రక్షితః

ధర్మాన్ని రక్షించండి. అది మిమ్మల్ని రక్షిస్తుంది.

విషయసూచిక

నాకిష్టమైనవి

ప్రస్తుత వీక్షకులు

నా ప్రపంచం

అతిథి దేవో భవః

స్వపరిచయం

 
నరసింహ - Template By Blogger Clicks