నాహం కర్తాః హరిః కర్తా తత్పూజా కర్మ చాఖిలం తదాపి మత్కృతా పూజా తత్ప్రసాదేన నా అన్యథా

Jul 29, 2008

ఓహో యంతటివాఁడే వొద్దనున్నవాఁడే హరి

బౌళి
ఓహో యంతటివాఁడే వొద్దనున్నవాఁడే హరి
సాహసపుగుణములచతురుఁడా యితఁడు. IIపల్లవిII

జలధిలోఁ బవళించి జలనిధి బంధించి
జలనిధికన్యకను సరిఁ బెండ్లాడి
జలనిధిలో నీఁది జలనిధి మథియించి
జలధి వెరించిన (వెరిఁజిన?) చలమరా యితడు. IIఓహోII

ధరణికిఁ బతియై ధరణి గ్రుంగిన నెత్తి
ధరణికూఁతురుఁ దానె తగఁ బెండ్లాడి
ధరణిఁ బాదము మోపి ధరణిభారము దించి
ధరణీధరుఁడైన దైవమా యితఁడు. IIఓహోII

కొండ గొడుగుగ నెత్తి కొండఁ దూఁటువడ నేసి
కొండకిందఁ గుదురై కూచుండి
కొండపై శ్రీ వేంకటాద్రి కోనేటిరాయఁడై
కొండవంటిదేవుడైనకోవిదుఁడా ఇతడు. IIఓహోII ౪-౩౯౩

చాలా సొగసైన సంకీర్తన.
ఓహో ఎంతటివాడే!మనవద్దనే వున్నవాడేనే యీ హరి! ఇతడు సాహసపు గుణములు కలిగిన చతురుడటే!
జలధి(సముద్రము)లో పవళించి(సృష్టి మొదటిలో),జలనిధిని(సముద్రాన్నే)బంధించి(రామావతారంలో),జలనిధికన్యక(లక్ష్మీ దేవి)ని తగ పెండ్లాడి,జలనిధిలో నీది(మత్స్యావతారం),జలనిధి మథియించి(కూర్మావతారం),జలధి వెరించిన(?)చలమరే యితడు.

ధరణికి మగడై(?),ధరణి కుంగగా ఎత్తిపట్టి(?),ధరణికూతుర్ని తానే పెండ్లాడి(రామావతారము),ధరణి పాదము మోపి(వామనావతారం?),ధరణి భారము దించి(పరశురామావతారం?),ధరణీధరుడైన(వరాహావతారం) దైవమా యితడు.
కొండ గొడుగుగా ఎత్తి(కృష్ణావతారం),కొండకు రంధ్రమయ్యేట్లుగా నేసి(?),కొండకింద కుదురుగా కూర్చుండి(కూర్మావతారం),శ్రీ వేంకటాద్రి కొండపై కోనేటిరాయడై కొండవలె అండగానుండే కోవిదుడా యితడు.

5 comments:

సుధాకర బాబు said...

నాకు తెలిసి కాదు. నా బుద్ధికి తోచినవి ---

జలధి వెరించిన - బాణం ఎక్కుపెట్టి సాగరిడిని భయపెట్టిన - రామావతారం

ధరణికి పతియై - భూదేవి భర్త

ధరణి కుంగగా ఎత్తిపట్టి - పాతాళాంతర్గతయైన భూదేవిని సముద్ధరించిన - వరహావతారం


కొండకు రంధ్రమయ్యేట్లుగా నేసి- కుమార స్వామి?

Unknown said...

ఈ కీర్తనలలో దశావతారాలు పదీ వచ్చినట్లుగా లేదు.అన్నమయ్య చాలా కీర్తనలు దశావతారాలు అన్నీ వచ్చేట్లుగా కీర్తిస్తుంటాడు.కాని దీనిలో ఒకే అవతారం ఒకటికంటె ఎక్కువ సార్లు రావటం,కొన్ని అవతారాలు అసలు రాకపోవటం వింతగా ఉంది.లేకపోతే మనం తప్పుగా అన్వయించుకుంటున్నామా అన్నది నా సందేహం.

కొత్త పాళీ said...

మీ అన్వయాలు కరక్టుగా ఉన్నట్టే ఉన్నాయి. ఈ పాటలో నీరు, భూమి, కొండ అనే మూడు ప్రకృతి ప్రతీకలతో వివిధ అవతారాల్లో పరమాత్ముడు చేసిన లీలల్ని చమత్కారంగా స్తుతించడమే ముఖ్యోద్దేశం .. దశావతారాల్నీ ఏకరువు పెట్టటం కాదని నా కనిపిస్తోంది.

కామేశ్వరరావు said...

>>కొండఁ దూఁటువడ నేసి
నరకాసురవధ ఘట్టంలో, నరకునికి రక్షణగా ఉండే పెద్ద పెద్ద కొండలని శ్రీకృష్ణుడు భేదిస్తాడు.

Unknown said...

కొత్త పాళీ గారికి,కామేశ్వరరావు గారికి:
ధన్యవాదములు.నా వివరణలు సరియైనవేనని ధైర్యం ఇప్పుడు కలిగి ఆనందంగా ఉంది.కొత్త విషయాన్ని తెలుసుకున్నందుకు ఆనందంగా కూడా వుంది.

ధర్మో రక్షతి రక్షితః

ధర్మాన్ని రక్షించండి. అది మిమ్మల్ని రక్షిస్తుంది.

విషయసూచిక

నాకిష్టమైనవి

ప్రస్తుత వీక్షకులు

నా ప్రపంచం

అతిథి దేవో భవః

స్వపరిచయం

 
నరసింహ - Template By Blogger Clicks