|
వరాళి
నెలమూఁడు శోభనాలు నీకు నతనికిఁ దగు
కలకాలమును నిచ్చకల్యాణమమ్మా IIపల్లవిII
రామనామమతనిది రామవు నీవై తేను
చామన వర్న మతఁడు చామవు నీవు
వామనుఁడందురతని వామనయనవు నీవు
ప్రేమపు(మీ)యిధ్దరికి పేరుబలమొకటే. IIనెలII
హరి పేరాతనికి హరిణేక్షణవు నీవు
కరిఁ గాచెఁ దాను నీవు కరియానవు
సరిఁ దా జలధిశాయి జలధికన్యవు నీవు
బెరసి మీ యిద్దరికిఁ బేరుబలమొక్కటే. IIనెలII
జలజనాభుఁ డతఁడు జలజముఖివి నీవు
అలమేలుమంగవు నిన్నలమెఁ దాను
ఇలలో శ్రీ వేంకటేశుఁడిటు నిన్నురాన మోచె
పిలిచి పేరుచెప్పెఁ బేరుబలమొక్కటే. IIనెలII ౭-౨౮౦
నెలకు మూడు యోగములు(శోభనము-27 గ్రహ యోగాలలో నొకటి), నీకు అతనికీ తగును.కలకాలము మీకు నిత్య కల్యాణమే.
ఆతనిదేమో రామనామము,నీవేమో రామ(రమించునట్టి స్త్రీ)వు.ఆతనిది చామనచాయ, నీవేమో చామవు(?).అతనిని వామనుడని
అంటారు,నీ వేమో వామనయనవు(చక్కని కన్నులు గల స్త్రీ).ప్రేమతో కూడే మీ యిద్దరికి పేరు బలము ఒకటే."హరి" అనే పేరున్నవాడతడు,నీవేమో హరిణేక్షణవు(లేడికన్నుల వంటి కన్నులు గలదానివి).కరిని కాచిన వాడతడు(గజేంద్ర మోక్షణము), నీవేమో కరియానవు(మంద(గజ)యానవు- ఏనుగ వలె ఠీవిగా నడచే దానవు).సరి అతడేమో జలధిశాయి(సముద్రమే పాన్పుగా గలవాడు),జలధికన్యవు నీవు(సముద్రము నుండి పుట్టిన లక్ష్మీ దేవివి).చేరి మీ యిద్దరికీ పేరు బలమొక్కటే.అతడు జలజనాభుడు (పద్మమును బొడ్డుయందు కలవాడు),నీవేమో జలజముఖివి(పద్మము వంటి ముఖము కలిగిన దానివి).నీ వలిమేల్మంగవు,నిన్ను కౌగిలించిన వాడతడు.ఇలలో శ్రీ వేంకటేశుడు యిటు నిన్ను తన వక్షస్థలమున మోయుచున్నాడు.నిన్ను పిలిచి పేరు చెప్పాడు.మీ యిద్దరికి పేరు బలమొక్కటే.
0 comments:
Post a Comment