|
భూపాళం
ఇప్పు డిటు కలగంటి నెల్లలోకములకు-
నప్పఁ డగు తిరువేంకటాద్రీశుఁ గంటి. IIపల్లవిII
అతిశయంబైన శేషాద్రిశిఖరము గంటి
ప్రతిలేని గోపురప్రభలు గంటి
శతకోటి సూర్యతేజములు వెలుఁగఁగఁ గంటి
చతురాస్యుఁ బొడగంటి చయ్యన మేలుకంటి. IIఇప్పుII
కనకరత్న కవాటకాంతు లిరుగడఁ గంటి
ఘనమైనదీపసంఘములు గంటి
అనుపమమణిమయమగుకిరీటము గంటి
కనకాంబరము గంటి గ్రక్కన మేలుకంటి. IIఇప్పుII
అరుదైన శంఖచక్రాదు లిరుగడఁ గంటి
సరిలేని యభయహస్తము గంటి
తిరువేంకటాచలాధిపునిఁ జూడఁగ గంటి
హరిఁ గంటి గురుఁ గంటి నంతట మేలుకంటి. IIఇప్పుII ౧-౩౮
0 comments:
Post a Comment