నారాయణిదేసాక్షి
ఇక్కడ నక్కడ సరే యెందాయ నేమి
మిక్కిలిచెలియపొందు మేలు నీకు రావయ్యా. IIపల్లవిII
తమితోడఁ బాలసముద్రముమీఁదఁ బవళించి
విమలుఁడవై యుండేటివేడుక కాఁడ
చెమటలసముద్రము చెలిమేన నున్న దిదె
ప్రమదాన నీవు నేఁడు పవళింతు రావయ్యా. IIఇక్కడII
చెలఁగి యాకసమెల్లా శ్రీపాదముననే
కొలచుకొంటా నుండేటికోడెకాఁడ
నలువున నీయింతినడిమియాకస మిదె
కొలఁది మిగుల నిట్టె కొలతు రావయ్యా. IIఇక్కడII
శ్రీవేంకటేశుఁడవై చిత్తగించి కొమ్మతో
యీవలఁ గొండపై నుండేటియెమ్మెకాఁడ
తావి నలమేల్మంగ తగుఁగుచగిరు లివి
వోవరిఁ గూడితి విందే వుందు విట్టే రావయ్యా. IIఇక్కడII ౧౬-౩౦౦
చెలి మేని మీఁద చెమటల సముద్రమే ఉందట.అదీ పాలసముద్రము లాంటిదే నట.అంచేత అక్కడయితే నేమి మరి ఇక్కడయితేనేమి అందుకని చెలిమేననే పవళింతువు రావయ్యా-ఇదో చమత్కారం.
ఆకాసాన్ని నీ శ్రీపాదంతో కొలుస్తూ ఉంటావు కదయ్యా.నీ యింతి నడుమే ఓ ఆకాసం కాదుటయ్యా.అంచేత అక్కడయితే నేమి మరి ఇక్కడయితేనేమి అందుకని చెలి నడుమునే కొలచుదువుగాని రావయ్యా-ఇదింకో చమత్కారం.
నీ కొమ్మతో(స్త్రీతో)కొండపైనే నివసిస్తున్న యెమ్మెకాడవు కదయ్యా.నీ యింతి అలమేల్మంగ కుచములు కూడా కొండల లాంటివే కదా.అంచేత అక్కడయితే నేమి మరి ఇక్కడయితే నేమి అందుకని చెలి కుచముల మీద ఇట్టే పరుందువుగాని రావయ్యా.-ఇదింకో చమత్కారం.
అన్నమయ్య ఊహలకి రెక్కలొచ్చినపుడు పరాకాష్టలో వెలువడిన ఆణిముత్యాల్లో ఇదొకటి.
Dec 4, 2008
ఇక్కడ నక్కడ సరే యెందాయ నేమి
Posted by
Unknown
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment