|
దేవగాంధారి
ఇట్టిముద్దులాఁడిబాలుఁ డేడవాఁడు వానిఁ
బట్టితెచ్చి పొట్టనిండఁ బాలు పోయరే IIపల్లవిII
గామిడై పారితెంచి కాఁగేటివెన్నలలోన
చేమపూవుకడియాలచేయి వెట్టి
చీమ గుట్టెనని తన చెక్కిటఁ గన్నీరు జార
వేమరు వాపోయె వాని వెడ్డువెట్టరే IIఇట్టిII
ముచ్చువలె వచ్చి తనముంగై మురువులచేయి
తచ్చేటిపెరుగులోనఁ దగఁ బెట్టి
నొచ్చెనని చేయి దీసి నోరనెల్లఁ జొల్లుగార
వొచ్చెలి వాపోవువాని నూరడించరే IIఇట్టిII
యెప్పుడు వచ్చెనో మాయిల్లు చొచ్చి పెట్టెలోన
చెప్పరానివుంగరాల చేయి వెట్టీ
అప్పఁ డైన వేంకటేశుఁ డాసపాలకుఁడు గాన
తప్పకుండ పెట్టె వానితల కెత్తరే IIఇట్టిII ౫-౧౪౮
1 comments:
ఇదే కీర్తనపై నేను అన్నమయ్య కృష్ణతత్వం అనే పేరుతో వ్యాసాన్ని సమకూర్చాను.త్వరలో post చేస్తాను. హరేకృష్ణ.
Post a Comment