|
ముఖారి
ఆఁకటివేళల నలపైన వేళను
తేఁకువ శ్రీహరినామమే దిక్కు మఱిలేదు IIపల్లవిII
కొఱమాలి వున్నవేళ కులముచెడినవేళ
ఛెఱవడి వొరులచేఁ జిక్కినవేళ
వొఱపైన హరినామ మొక్కటే గతిగాక
మఱచి తప్పిననైన మఱిలేదు తెఱఁగు IIఆఁకటిII
ఆపదవచ్చినవేళ నాఱడిఁబడినవేళ
పాపపు వేళల భయపడిన వేళ
వోపినంత హరినామమొక్కటే గతిగాక
మాపుదాఁకాఁ బొరలిన మఱిలేదు తెఱఁగు IIఆఁకటిII
సంకెలఁ బెట్టినవేళ చంపఁబిలిచిన వేళ
అంకిలిగా నప్పులవా రాఁగినవేళ
వేంకటేశునామమే విడిపించ గతిగాక
మంకుబుద్ధిఁ బొరలిన మఱిలేదు తెఱఁగు IIఆఁకటిII
2 comments:
సర్వకాల సర్వావస్థలయందు హరినామమే మనకు దిక్కు. హరేకృష్ణ
అవును నిజం.శ్రీహరి ధ్యానమే చెడని వదార్థము.
హరే శ్రీనివాస.
Post a Comment