2వ భాగం.
"నాయనా! ఈ కొండ సాలగ్రామమయము। దీనిని చెప్పుకాళ్ళతో ఎక్కరా"దని చెప్పెను.ఆ యూరడింపునకు తనిసి అన్నమయ్య జగన్మాతపై వేంకటేశ్వర మకుటముతో ఆశుధారగా ఒక శతకము చెప్పెను. ఆపై చెప్పులు వదలి ఎక్కి మెల్లగా కొండచేరి చూడదలచిన స్థలములన్నియు చూచి ఆ రాత్రి నివసించి మరునాడు వేకువన కోనేటిలో స్నానముచేసి పండ్రెండు నామములు ధరించి దేవళమునకు పోగా గుడి తలుపులు తాళమువేసి యుండిరట. అన్నమయ్య స్వామిని శతకముతో కీర్తింపగనే తలుపులు తమకు తామే వీడెను. వైఖానసు లీతని మహిమ గుర్తించి స్వామి దర్శనము చేయించి ప్రసాదమిచ్చి గౌరవించినారు. ఇట్లు స్వామి నాతడెన్ని దినములు సేవించెనో,ఎప్పుడు స్వామి ప్రత్యక్షమాయెనో తెలియదు.ఒకనాడు విష్ణునామధేయుడైన యతికి స్వామి కలలో ప్రత్యక్షమై "నావాడొకడు రేపు నీ కడకు వచ్చును. ఆతనికి నీవు చక్రాంకనము చేసి పంచసంస్కారములతో వైష్ణవ దీక్ష నిప్పింపు"మని చెప్పెనట.ఆతడు వెరగంది లేచి ఉదయముననే తన నిత్యకృత్యములు దీర్చికొని శంఖచక్ర ముద్రలు చేతనూని అన్నమయ్యకై అఱ్ఱులు చాచి చూచుచుండెను.ఇంతలో స్వామి కలలో చెప్పిన గుర్తులతో అన్నమయ్య ఆ యతి ముంగిలి చేరగనే అతడానందపడి అన్నమయ్యకు చక్రాంక సంస్కారములు చేసి వైష్ణవదీక్ష ఇచ్చెనట. నాటినుండి అన్నమయ్య అన్నమాచార్యులయిరి. ఆపై గురువుగారి ఆనతితో ఊరికిపోయి పెద్దలమాట మేరకు తిరుమలక్క (తిమ్మక్క), అక్కలమ్మల నొకేసారి వివాహమై అహోబిలమున శఠకోపయతిచే శ్రీ వైష్ణవ సిద్ధాంమగు విశిష్టాద్వైతమును సమగ్రముగ నభ్యసించి, తన జీవితమంతయు ఆ మతప్రచారమునకే అంకితము చేసినారు.
విరక్తుడు హరిభక్తిపరాయణుడుఅగు అన్నమయ్య మహిమలూ,సాహిత్యమూ నానాటికీ బలిసి దేశమంతట వ్యాపించినవి.ఆనాళ్ళలో "టంగుటూరు"ను రాజధానిగా చేసికొని రాజ్యమేలుచుండిన సాళువ నరశింహరాయలు అన్నమయ్య కీర్తి విని ఆయనను తన యాస్థానమునకు పిలిపించుకొని అతనితో పాడించి విని ఆనంందించి కాంచనా భరణాదులచే సత్కరించెనట.రాజుగూడ హరిభక్తి గలవాడు గదా యని అన్నమయ్యయు అతని పిలుపును మన్నించి చేసిన సత్కారమును శ్రీనివాస ప్రీతిగ స్వీకరించెను. ప్రతిదిన మాస్థానమూ, సంకీర్తనల గానమూ, సాహిత్యగోష్ఠీ సాగుచుండెను. ఒకనాడు, అన్నమయ్య శ్రీవేంకటేశ్వరుపై శృంగార రసవాహినిగా రచించిన "ఏమొకొ చిగురుటధరమున"(౧౨ సం. ౮౨వ పాట) అనుపాట పాడుటయు, సభయంతయు నిలుపులేని తలయూపులతో మెచ్చుకొనుటయు జరిగినది.కొందరీతని పాట విని తుంబురుడో,నారదుడో అవతరించె ననియు, కొందరీతని కవితను గుర్తెరిగి కాళిదాసుడే జన్మించినాడనియు కొనియాడుచుండిరి. ఆ పాట వినిన రాజు ఆనందపరవశుడై అన్నమయ్య నభినందించి "ఇట్టి కీర్తనము నాపై నొకటి రచింపు" మని ప్రార్ధించెనట. వెంటనే యన్నమయ్య రెండు చేతులతో చెవులు మూసికొని "శ్రీహరీ!పరమపతివ్రతా భావముతో శ్రీహరిని కీర్తించు నా జిహ్వ మానవుని కీర్తింపజాల"దనెను.తోడనే రాజు కెదలోని కోపము ముక్కుపై నెదురైనది.నెచ్చలి వని మెచ్చి ఒక కీర్తన నాపై రచింపుమనగా ఇంత తిరస్కారమా"యని ప్రభుతాహంకారముతో అన్నమయ్యకు సంకెళ్ళు వేయించి చెరసాలలోనుంచగా అన్నమయ్య:-
ముఖారి
ఆఁకటివేళల నలపైన వేళను
తేఁకువ శ్రీహరినామమే దిక్కు మఱిలేదు IIపల్లవిII
కొఱమాలి వున్నవేళ కులముచెడినవేళ
ఛెఱవడి వొరులచేఁ జిక్కినవేళ
వొఱపైన హరినామ మొక్కటే గతిగాక
మఱచి తప్పిననైన మఱిలేదు తెఱఁగు IIఆఁకటిII
ఆపదవచ్చినవేళ నాఱడిఁబడినవేళ
పాపపు వేళల భయపడిన వేళ
వోపినంత హరినామమొక్కటే గతిగాక
మాపుదాఁకాఁ బొరలిన మఱిలేదు తెఱఁగు IIఆఁకటిII
సంకెలఁ బెట్టినవేళ చంపఁబిలిచిన వేళ
అంకిలిగా నప్పులవా రాఁగినవేళ
వేంకటేశునామమే విడిపించ గతిగాక
మంకుబుద్ధిఁ బొరలిన మఱిలేదు తెఱఁగు IIఆఁకటిII (అధ్యా.సం.,౨౬ రేకు)
అని స్వామిని ప్రార్ధింపగా సంకెలలు తమకుతామే వీడినవట.రాజీసంగతి విని రెట్టించిన కోపముతో చెఱసాలనున్న అన్నమయ్య కడకు వచ్చి"మాయలు నాతో పనికిరావు. చఱసాల కావలివారికి లంచమిచ్చి సంకెళ్ళూడదీయించుకొని ఇది దైవానుగ్రహముగ చాటు కొను చున్నావు. ఇదిగో నా యెదుట ఇప్పుడే సంకెళ్ళు వేయించుచున్నాను. నీకు దైవబలమున్నది నిజమైనచో ఇప్పుడు సంకెళ్ళు విడిపించుకొ"మ్మని మరల సంకెళ్ళువేయింపగా అన్నమయ్య పైవిధముగనే శ్రీవేంకటేశు ప్రార్ధింపగా వెంటనే సంకెళ్ళూడిపోయినవట. అటుపై రాజు అన్నమయ్యకు సాష్టాంగపడి చేసినతప్పు మన్నించమని వేడుకొని అన్నమయ్య నందలమెక్కించి ఒక కోపు తాను మోయుచు నూరేగింపు చేసి పశ్చాత్తాపపడి ఘనముగ సంభావించెనట."చేసిన తప్పునకు పశ్చాత్తాపపడితివి.నిన్ను శ్రీహరి రక్షించుగాక!" అని దీవించి అన్నమయ్య యథాపూర్వముగ నుండెనట. అన్నమయ్య చెప్పినది చెప్పినట్లే జరుగుట ఇత్యాది మహిమలింక ననేకములు గలవు.(ఇంతవరకూ వ్రాసినది చిన్నన్న వ్రాసిన అన్నమాచార్య చరిత్రమును ఆధారముగా చేసికొని వ్రాసినది.)
అన్నమయ్య మతము:-
అన్నమయ్య పుట్టుకతో స్మార్తబ్రాహ్మణశాఖకుచెంది అద్వైతి అయినను తాను వలచి స్వీకరించినది శ్రీవైష్ణవ సిద్ధాంతమగు విశిష్టాద్వైతమే. ఆ మతమువారే దీక్ష యిచ్చి మత ప్రబోధము చేసినవారు. ఆ పనిగూడ స్వామి యనుగ్రహము వలననే సాగినది.
దేసాళం
గతులన్ని ఖిలమైన కలియుగమందున
గతి యీతఁడే చూపె ఘనగురుదైవము IIపల్లవిII
యీతని కరుణనేకా యిల వైష్ణవులమైతి-
మీతనివల్లనే కంటి మీ తిరుమణి
యీతఁడేకా వుపదేశ మిచ్చె నష్టాక్షరిమంత్ర-
మీతఁడే రామానుజులు యిహపరదైవము. IIగతుII
వెలయించె నీతఁడేకా వేదపురహస్యములు
చలిమి నీతఁడే చూపే శరణాగతి
నిలిపినాఁ డీతఁడేకా నిజముద్రాధారణము
మలసి రామానుజులే మాటలాడేదైవము. IIగతుII
నియమము లీతఁడేకా నిలిపెఁ ప్రపన్నులకు
దయతో మోక్షము చూపెఁ దగ నీతఁడే
నయమై శ్రీవేంకటేశునగమెక్కేవాకిటను
దయఁజూచీ మమ్ము నిట్టే తల్లి తండ్రి దైవము. IIగతుII ౨-౩౭౨ అధ్యా-౧౭౫ వ రేకు
పైకీర్తనము స్పష్టముగ నీతని మతమిదియని చాటుచున్నది. వీరి వివిధ సాహిత్యప్రక్రియలును ఆ మతము పై నాధారపడి నడచినవే.
"సహజ వైష్ణవాచారవర్తనుల సహవాసమె మాసంధ్య" --ఇత్యాదులుగూడ ఈతని మతస్వరూపమును తెలుపునవియే.
ఇంకా వుంది--
Sep 14, 2008
తాళ్ళపాక పదసాహిత్యము-5వ సంపుటము-పీఠికలు
Posted by
Unknown
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment