ఎవరీ ముగ్ధమనోజ్ఞ దర్శనుఁ ! డెవం డీ శారదామూర్తి ! యీ
నవశృంగార రసావతారుఁ డెవరన్నా! శ్రీమదజ్జాడయే
యవునా ! ఆ దరహాస ! మా నడకతీ ! రా ఠీవి ! యా దర్ప ! మా
కవితాదీప్తి ! యనన్యసాధ్యములురా ! కై మోడ్పు లందింపరా!
పండించె నీకాలి గండపెండెరము రం
గారు ముంగారు బంగారు పంట
నర్తించె నీకీర్తి నవనవస్ఫూర్తి యా
సేతు శీతాచల క్ష్మాతలాన
జోహారులందె నీ సాహిత్యనందిని
కదిలించి సహృదయహృదయములను
గంభీరమయ్యె నీ "శంభో" నినాదంబు
దిగ్దిగంతాలఁ బ్రతిధ్వనించి
కాంతులీనెను రాజ సభాంతరాల
నీ జయశ్రీ దృగంత నీరాజనాలు;
యక్షగానకళా మహాధ్యక్షపదవి
అక్షరంబయ్యె నీ పట్ల "నాదిభట్ల!"
చిఱుతాళముల జత చే ధరించినఁ జాలు
లయతాళములు శుభోదయము పలుకు
కాలిగజ్జె లొకింత ఘల్లు మన్నం జాలు
భరతమ్ము నీ ముందు శిరసు వంచు
వీణతంత్రుల మునివ్రేళ్ళు సోకినఁ జాలు
సంగీతవాహిని పొంగిపొరలు
గంటంబుఁ బూని క్రీగంటఁ గాంచినఁ జాలు
కవిత నీ యెదుట సాక్షాత్కరించు
నేఁటి కథకులందు నీ పేరు చెప్పక
గజ్జె గట్టువాఁడు కానరాఁడు;
తెలుగువెలుఁగు దేశదేశాల నింపిన
హరికథా పితామహా ! నమోస్తు!!
కల్యాణి రుక్మిణీ కన్య మెల్లఁగ నల్ల
నయ్య భుజమ్ముపై చెయ్యి వైచె
జనని జానకి మహాశపథమ్మురో సుప
థమ్ము చూపెను సతీధర్మమునకు
వరగాత్రి సావిత్రి వైవస్వతుని నిల్పి
మగని ప్రాణాలకై తగవులాడె
చిన్ని మార్కండేయు శివభక్తి పదమెత్తి
మృత్యుదేవత గుండె మీఁదఁ దన్నె
"మ్రొక్కుబడిఁ" జిక్కువడి వేదరుక్కు లెల్ల
నచ్చపుం దెల్గు కలకండ లచ్చువోసె;
నీదు ప్రతిభకు లోనుకానిది మఱేది ?
స్వర సురత్రాణ ! అష్టభాషా ప్రవీణ !
చల్లపల్లి నృపాలు సంతోష మెంతయో
గండ పెండర మిచ్చి గౌరవించె
ఆనందగజపతి మేనెంత పొంగెనో
రమణీయ రత్నహారము లొసంగె
మైసూర్ మహారాజు మదిముద మ్మది యెంతొ
కనకాంబరమ్ములు కట్టఁబెట్టె
సరస విద్వన్మహాసమితి మే లెట్టిదో
ఘంటా సువర్ణ కంకణము లిచ్చె
లలిత సంగీత సాహిత్య కలిత యగుచు
భరతభారతి హారతి పట్టె నీకు;
హరికథావ్యాసునకును- స్నేహార్ధ్ర మధుర
హాసునకును - నారాయణ దాసునకును -
"నేతి" సౌవర్ణ మాణిక్య పీఠము వెట్ట
"కుప్పా" జగా వెల్ల గొడుగుఁ బట్ట
"నౌడూరి" శిల్ప సుందర కిరీటముఁ గూర్ప
"అమ్ముల" శ్రీ తిలకమ్ము తీర్ప
"చీరాల" నవరత్న హారాలు కై సేయ
"చిట్యాల" మంజు మంజీరము లిడ
"కూచిభట్ల" మనోజ్ఞ కుండలా లర్పింప
"ములుకుట్ల" పన్నీరు చిలుకరింప
"వాణి" యును "వేణి" "రాణి" పారాణి దిద్ద
కొలువు దీరెను హరికథా కువలయాక్షి;
మ్రొక్కె నీకు సుగాత్రి నీముద్దుపుత్రి
నెట్లు దీవింతువో ఆదిభట్ల బాబు !
"బాలాజి" సరిక్రొత్త పారిజాతము లివ్వి
"భోగలింగము" జాజి పువ్వు లివ్వి
"పరిమి సుబ్రహ్మణ్యు" సరసీరుహము లివ్వి
"పాతూరి" వకుళ పుష్పమ్ము లివ్వి
"పెద్దింటి" మేల్ గులాబి ప్రసూనము లివ్వి
"ములుకుట్ల" సంపెంగ మొగ్గ లివ్వి
"బాలబ్రహ్మానందు" నీలోత్పలా లివ్వి
"తెల్లాకుల" వి మంచి మల్లె లివ్వి
కమ్మని సుగంధములు విరజిమ్ము నేఁడు
హరికథోద్యాన వనమందు; నందుకొనుము
నీవు నాటిన తోటలో పూవులొసఁగు
శ్రీ సపర్య ! నారాయణదాసవర్య !
"ఎవడురా ! యచట తెం డింకొక్క గ్లా" సంచు
అమృత రక్షకులకు నాజ్ఞ యొసఁగి
"సుధకంటె మా హరికథ లెస్స" యని బృహ
స్పతితోడ నర్మ భాషణము నెఱపి
"ఏమమ్మ వాణి ! యేదీ వీణ ! సరిక్రొత్త
తీవలా" యని 'గిరాందేవి' నడిగి
"ఆగవే రంభ ! ఆ హస్త మట్టులు గాదు
త్రిప్పిపట్టు" మటంచు తప్పుదిద్ది
"ఏమయా ! క్రొత్త సంగతు లే" మటంచు
బ్రహ్మమానసపుత్రుని పలుకరించి:
ఆదిభట్ల నారాయణాఖ్యము మహస్సు
తిరుగు నిందందు స్వర్గ మందిరములందు! !
సంగీత సాహిత్య జగదంగణము ధగ
ద్ధగిత మ్మొనర్చు గంధర్వతార
వాసిఁగాంచిన మహావాగ్గేయకారుఁడై
భారతి నర్చించు భక్త మౌళి
అమరుఁడౌ "ఉమరు ఖయ్యాం" రుబాయతు లాంధ్ర
సంస్కృతమ్ముల కెత్తు సవ్యసాచి
హరికథారాజ్య మూర్ధభిషిక్తుండయ్యు
స్వార్థం బెఱుంగని పార్థివుండు
వాలు మెలి మీసకట్టు, జుల్పాల జుట్టు,
నొసట కుంకుమబొట్టు, మేల్పసిడిగట్టు,
విద్దెలకు పట్టు ! నడయాడు వేల్పుచెట్టు!
హరికథా శిల్పసమ్రాట్టు! "ఆదిభట్టు".
ఆదిభట్ల వారి జన్మదిన సందర్భంగా గురువుగారు భైరవభట్ల కామేశ్వరరావు గారు వ్రాసిన "కళల నెలవుకో నూలుపోగు" కు అదనంగా "కరుణశ్రీ" గారి ఈ "నూలుపోగు"ను కూడా చేర్చితే మరింత అందగిస్తుందనే ఆశతో------
Sep 2, 2008
ఆదిభట్ల నారాయణ దాసు
Posted by
Unknown
*
కరుణశ్రీ
Subscribe to:
Post Comments (Atom)
3 comments:
బ్లాగుల్లోకి వచ్చిన తరువాత మీబోటి విజ్ఞుల ద్వారా "కాస్త ఓపికగా" పద్యాలు కూడా చదవటం అబ్బుతుందండీ.
చాలా బాగుంది. సులభంగా అర్ధమవుతుంది. ఏవిధమైన ్పదాడంబరమూ లేకుండా. బహుసా అది కరుణశ్రీ గారిది అవ్వటం మూలానేమో.
మంచి పద్యాన్ని పరిచయం చేసారు ధన్యవాదములు.
బొల్లోజు బాబా
అందగించింది మీరన్నట్టుగానే.
నాకొక్క యనుమానము. "మ్రొక్కుబడిఁ జిక్కువిడి"యా "చిక్కువడి"యా? అది ముద్రాస్ఖాలిత్యమైతే ఫర్వాలేదు కానీ లేకుంటే నాకు మాత్రం "చిక్కువిడి"యే ఒప్పుతుందనిపిస్తోంది.
చిక్కువడి అనే వుంది.అర్ధానుస్వారము ముందుండటం చేత అది జిక్కువడి గా అయింది.ముద్రణ లో స్ఖాలిత్యమో కాదో నాకు తెలియదు.
Post a Comment