నాహం కర్తాః హరిః కర్తా తత్పూజా కర్మ చాఖిలం తదాపి మత్కృతా పూజా తత్ప్రసాదేన నా అన్యథా

Sep 1, 2008

ఏమొకొ చిగురుటధరమున యెడనెడఁ గస్తురి నిండెను

శ్రీమతి శోభారాజుగారి పాట ఇక్కడ వినండి

Get this widget | Track details | eSnips Social DNA

నాదరామక్రియ
ఏమొకొ చిగురుటధరమున యెడనెడఁ గస్తురి నిండెను
భామిని విభునకు వ్రాసిన పత్రిక కాదుగదా. IIపల్లవిII

కలికి చకోరాక్షికిఁ గడకన్నులుఁ గెంపై తోఁచిన
చెలువంబిప్పుడిదేమో చింతింపరె చెలులు
నలువునఁ బ్రాణేశ్వరుపై నాఁటిన యాకొన చూపులు
నిలువునఁ బెరుకఁగ నంటిన నెత్తురు గాదు గదా. IIఏమొII

పడఁతికి చనుఁగవ మెఱుఁగులు పైపైఁ బయ్యెద వెలుపల
కడు మించిన విధమేమో కనుఁగొనరే చెలులు
ఉడుగని వేడుకతోఁ బ్రియుఁ డొత్తిన నఖ శశి రేఖలు
వెడలఁగ వేసవికాలపు వెన్నెల గాదు గదా. IIఏమొII

ముద్దియ చెక్కుల కెలఁకుల ముత్యపు జల్లుల చేర్పుల
వొద్దికలాగు లివేమో వూహింపరె చెలులు
గద్దరి తిరువేంకటపతి కామిని వదనాంబుజమున
అద్దిన సురతపుఁ జెమటల అందము గాదు గదా। IIఏమొII ౫-౮౨

ఈ సంకీర్తన నాకు చాలా బాగా నచ్చిన సంకీర్తనలలో ఒకటి।
ఏమొకొ(ఏమి+ఒకొ)=సందేహాస్పదమై,ఆశ్చర్యాన్నీ కలిగించే విషయాన్ని గురించి చెప్పేటప్పుడు వాడే పదబంధం।
చిగురువలె లేతదైన క్రింది పెదవిమీద అక్కడక్కడా కస్తూరి నిండెను (కస్తూరి అంటెను అనటం లేదు-నిండెను అంటున్నాడు) అంటే కస్తూరికా ముద్రలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయన్నమాట।ఆ కస్తూరికా ముద్రలు ఎలా ఉన్నాయటా? భామిని(దేవేరి) విభునకు(శ్రీవేంకటేశ్వరునకు) వ్రాసి పంపించిన ప్రేమలేఖ కాదు గదా అన్పించేట్టుగా ఉన్నాయటా కస్తూరికా ముద్రలు।
చకోరాక్షి యైన యీ కలికి కంటిచివరలు కెంపురంగులో ప్రకాశిస్తున్నాయట।దానికి కారణం ఏమైవుంటుందో వూహింపరె చెలులు। ఇలా అని చెలులు తమలోతాము అనుకొంటున్నట్లుగా చేసిన అందమైన ఊహ ఈ సంకీర్తనం।ప్రాణేశ్వరుని అంకసీమను ఒప్పిదముగా నాటిన దేవేరి యొక్కఆ కొనచూపులు(కంటి చివరిచూపులు) నిట్టనిలువునా పెరికివేయగా (వెనక్కు తీసుకోగా) ఆ చూపులకు అంటిన నెత్తురు కాదుగదా అనిపిస్తోందట।--ఎంత అందమైన ఊహ!
ఆ దేవేరికి చనుగవ మీద ప్రకాశించే చంద్రకాంతి మెఱుగులు పయ్యద వెలుపలికి కడుమించి కనుపిస్తున్న తీరు ఏవిధమైనదో, చెలులారా! కనుక్కోండే!...తొలగని లేక తక్కువకాని వేడుకతో ప్రియుడు చనుగవ మీద ఒత్తగా ఏర్పడిన చంద్రవంకల్లాంటి గోళ్ళ గుర్తులావిధంగా బయటకు ప్రకాశాన్ని వెదజల్లుతున్నాయట।పైగా ఆ ప్రకాశం చూడగా చూడగా వేసనికాలపు వెన్నెల కాదుగదా అన్పిస్తోందట।--ఎంత అందమైన పోలిక?
ఆ ముద్దియ చెక్కిళ్లప్రక్కల చేర్చబడిన ముత్యాల జల్లుల అందములు ఎలా ఉన్నాయో ఊహించండే అని ఒకరు ఇంకొకరితో అంటున్నారట।ఆ ముత్యాల జల్లులు ఇంకోటీ ఇంకోటీ కాదట। శ్రీ వేంకటేశ్వరుడు కామిని ముఖపద్మం మీద అద్దిన రతికాలపు చెమటచుక్కల అందము కాదుగదా అని ఆశ్చర్యపడుతున్నారట।-- పరాకాష్ట.

1 comments:

చిలమకూరు విజయమోహన్ said...

వినాయక చవితి శుభాకాంక్షలు.

ధర్మో రక్షతి రక్షితః

ధర్మాన్ని రక్షించండి. అది మిమ్మల్ని రక్షిస్తుంది.

విషయసూచిక

నాకిష్టమైనవి

ప్రస్తుత వీక్షకులు

నా ప్రపంచం

అతిథి దేవో భవః

స్వపరిచయం

 
నరసింహ - Template By Blogger Clicks