సామంతం
కంటి నిదే యర్థము ఘనశాస్త్రములు దవ్వి
నంటున నిందుకంటెను నాణె మెందూ లేదు IIపల్లవిII
మేఁటి వైరాగ్యముకంటే మిక్కిలి లాభము లేదు
గాఁటపువిజ్ఞానముకంటే సుఖము లేదు
మీఁటైన గురువుకంటే మీఁద రక్షకుఁడు లేఁడు
బాటసంసారముకంటే పగ లేదు. IIకంటిII
పరపీడసేయుకంటే పాపము మరెందు లేదు
పరోపకారముకంటే బహుపుణ్యము లేదు
నిరతశాంతముకంటే నిజధర్మ మెందు లేదు
హరిదాసుఁడౌకంటే నట గతి లేదు. IIకంటిII
కర్మసంగము మానుకంటేఁ దేజము లేదు
అర్మిలిఁ గోరికమానేయంతకంటే బుద్ది లేదు
ధర్మపు శ్రీవేంకటేశుఁ దగిలి శరణుచొచ్చి
నిర్మలాన నుండుకంటే నిశ్చయము లేదు। IIకంటిII
అన్నమయ్య సర్వ శాస్త్రాల్లోని సారాన్ని మనకోసం రంగరించి ఈ కీర్తనలో పొందుపరచాడు.
ఆయన ఘనమైన శాస్త్రాలనన్నిటిని తవ్విపోసి కనుక్కున్న అర్ధాన్ని ఇక్కడ మనకు చెప్పుతున్నాడు.స్నేహమున ఇంతకంటె నాణ్యమైన సంగతి ఎక్కడా లేదని మరీ ఢంకా బజాయిస్తున్నాడు.
అన్నిటికంటె ఎక్కుడైన లాభం ఏదైనా ఉందంటే అది గొప్పదైన వైరాగ్యమే.అంతకంటే లాభం మరెందులోనూ లేదు.అలాగే అధికమైన విజ్ఞానము కంటే సుఖం ఇంకేమీ లేదు.అధికుడైన గురువుకంటే గొప్ప రక్షకుడూ లేడు.సంసారమార్గముకంటే ఎక్కువైన పగా లేదు.
ఇతరులను పీడించడం కంటే పాపం మరి యెందులోనూ లేదు, అలాగే పరోపకారం కంటె ఎక్కువైన పుణ్యమూ లేదు. అన్నిధర్మాల్లోకంటే ఎక్కుడైన స్వధర్మం మిక్కిలి ఆసక్తితోకూడిన శాంతగుణం.మరణానంతరం పొందబోయే గతులన్నిటిలో సద్గతి హరిదాసుడవటం వల్లనే కలుగుతుంది.
కర్మతో కూడి ఉండటాన్ని మానడం కంటే ఎక్కుడైన తేజము ఇంకెక్కడా లేదు.బుద్ధులన్నిటిలోను గొప్ప బుద్ధి అపేక్షతో కోరికలన్నిటినీ విడిచివేయడమే.ధర్మానికి ప్రతిరూపమైన శ్రీవేంకటేశ్వరుణ్ణి తగిలి శరణు చొచ్చి నిర్మంలంగా ఉండటంకంటె మంచి నిశ్చయము ఇంకెక్కడా లేదు.
ఇంతకంటే తరుణోపాయం ఈ జీవితానికి ఇంకేమైనా ఉందా?--లేదు గాక లేదు.
Aug 20, 2008
కంటి నిదే యర్థము ఘనశాస్త్రములు దవ్వి
Posted by
Unknown
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment