రామక్రియ
చాటెద నిదియే సత్యము సుండో
చేటు లేదీతని సేనించినను IIపల్లవిII
హరినొల్లనివా రసురలు సుండో
సుర లీతనిదాసులు సుండో
పరమాత్ముఁ డితఁడె ప్రాణము సుండో
మరుగక మఱచిన మఱి లేదిఁకను. IIచాటెదII
వేదరక్షకుఁడు విష్ణుఁడు సుండో
సోదించె శుకుఁ డచ్చుగ సుండో
ఆదిబ్రహ్మగన్నాతఁడు సుండో
యేదెస వెదకిన నితఁడే ఘనుఁడు. IIచాటెదII
యిహపర మొసఁగను యీతఁడె సుండో
వహి నుతించెఁ బార్వతి సుండో
రహస్య మిదివో రహి శ్రీవేంకట-
మహిధరంబున మనికై నిలిచె. IIచాటెదII
అన్నమయ్య ఏదైనా విషయాన్ని నొక్కి చెప్పదలిస్తే దాన్ని చాటింపు వేసి మరీ చెప్తాడు.ఈ విషయం చాలా సంకీర్తనల విషయంలో మనకు కనిపిస్తుంది.
ఇదే సత్యము అని చాటింపువేసి మరీ చెప్తున్నాను వినండోహో---శ్రీహరిని సేవిస్తే నష్టం ఎంతమాత్రమూ లేదు గాక లేదు.
శ్రీహరిని అంగీకరించని వాళ్ళందరూ రాక్షసులే,దేవతలందరూ ఈతని దాసులే సుండో.పరమాత్ముడైన ఈతడే ప్రాణము సుండో.
ఇది సంతాపించి మరిస్తే మరిక ఏమీ లేదు.
విష్ణుడే వేదరక్షకుడు,దీనిని శుకమహర్షి మనకు శోధించి నిరూపించాడు.సృష్టికి ఆదిమూలమైన బ్రహ్మను కన్నవాడీతడే.యే దెసను
వెదకినా యీతడే ఘనుడు.
మనందరికీ ఇహపరాలొసగే దీతడే.ఇతనిని పార్వతీ దేవి ప్రార్ధించింది.(విష్ణు సహస్ర నామాల్లో చివరను శివుడు పార్వతీ దేవికి "శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే- సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే" అంటూ విష్ణుమూర్తిని సంక్షిప్తంగా కీర్తించే విధానాన్ని బోధిస్తాడు).రహస్యమిది, శ్రీవేంకటేశ్వరుని కొండమీద ప్రతిష్టించబడి నిలిచి వున్నది.
Aug 20, 2008
చాటెద నిదియే సత్యము సుండో
Posted by
Unknown
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment