బౌళి
జగన్మోహనాకార చతురుఁడవు పురుషోత్తముఁడవు
వెగటునాసోదంబు ఇది నీవెలితో నావెలితో IIపల్లవిII
యెన్ని మారులు సేవించినఁ గన్నులూ దనియవు
విన్న నీకథామృతమున వీనులుఁ దనియవు
సన్నిధిని మిమ్ము నుతియించి సరుస జిహ్వయుఁ దనియదు
విన్న కన్నది గాదు ఇది నావెలితో నీవెలితో IIజగII
కడఁగి నీప్రసాదమే కొని కాయమూఁ దనియదు
బడిఁ బ్రదక్షిణములుసేసి పాదములు నివిఁ దనియవు
నుడివి సాష్టాంగంబు చేసి నుదురునూఁ దనియదు
వెడఁగుఁదన మిది గలిగె నిది నావెలితో నీవెలితో IIజగII
చెలఁగి నిను నేఁ బూజించి చేతులూఁ దనియవు
చెలువు సింగారంబు దలఁచి చిత్తమూఁ దనియదు
అలరి శ్రీవేంకటగిరీశ్వర ఆత్మ నను మోహించఁజేసితి
వెలయ నిన్నియుఁ దేరె మును నీవెలితో నావెలితో IIజగII ౨-౩౭౫
ఈ కీర్తనను బాలక్రిష్ణప్రసాద్ గారు పాడగా (టివి లో) విని పరిచయం చేయాలనిపించింది.
జగన్మోహనాకారుడైన శ్రీవేంకటేశ్వరుడా నీవు పురుషోత్తముడవు,బహు చతురుడవు కూడా.
ఆస్వాదనము వెగటు కలిగిస్తోంది.ఇది నీ వెలితో నా వెలితో తెలియకుండా ఉన్నది.
నిన్ను యెన్ని మారులు సేవించినా నా కన్నులకు తనివి తీరటం లేదయ్యా. నీ కథామృతాన్ని ఎంత విన్నా నా చెవులకి తృప్తి కలగటం లేదయ్యా.మీ సన్నిధిలో మిమ్మల్నెంత నుతించినా కూడా నా నాలుకకు తనివి తీరటం లేదే.విన్నదీ కాదు, కన్నదీ కాదు.ఇది నా వెలితో నీ వెలితో తెలియరావటం లేదు.
నీ ప్రసాదాన్ని పొంది కూడా నా శరీరం తృప్తి చెందటం లేదు.నీ చుట్టూ ప్రదక్షిణలు చేసి చేసి నా పాదాలూ తనియటం లేదే.నీకు సాష్టాంగ నమస్కారాలు చేసి చేసి కూడా నా నుదుటికి తనివి తీరటం లేదయ్యా.వెడగు తనమిది కలిగింది.ఇది నా వెలితో నీ వెలితో తెలియట్లేదే.
నిన్ను పూజ చేసి చేసిన నా యీ చేతులూ తనివినొందటం లేదే.నీ అందమైన సింగారాన్ని తలచుకొని కూడా నా చిత్తమూ తనివినొందటం లేదే.ఓ వేంకటేశ్వరా నా ఆత్మనూ నన్నూ మోహింపచేసితివి.మునుపే ఇవన్నియు తెలియవచ్చినవి.కారణం నీ వెలితో నా వెలితో తెలియరావటంలేదే.తెలియ జేయవయ్యా.
క్రితం వారం తాడేపల్లిగూడెంలో టి.టి.డి. కల్యాణమండంపంలో జరిగిన మా బంధువులబ్బాయి పెళ్ళికి వెళ్ళా. ముహూర్తం రాత్రి 11 గంటల తర్వాతనే. అందుకని ఆడపెళ్ళి వారు చుట్టాలని అలరించటం కోసమని ఓ కోలాటం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసారు. అందరూ 5 నుంచి 12 సంవత్సారల వయసు లోపలి పిల్లలే. ఆడపిల్లలూ మగపిల్లలూ మొత్తం ఓ 40 నుంచి 50 మంది వరకూ వుంటారు.ఆడపిల్లలంతా వంగపండు రంగు(ఎర్ర బోర్డరుతో)జాకట్లు అదే రంగు కాంబినేషనుతో ఉన్న పరికిణీలతోనూ, మగపిల్లలంతా ఎర్రెర్రని హరిదాసుల తలపాగాలు,పంచెలు కట్టుకొని రెండు వరుసల్లో అటు ఇటూ మారి మారి గంతులు వేస్తూ కాళ్ళకి గజ్జెలతో కోలాటం చేసారు.ఏవో సినిమా పాటలూ వగైరా పాడతారేమో ఒకటి రెండు నిముషాలు చూచి వెళదామని కూర్చున్నా.
కానీ హాశ్చర్యపడిపోయా!!! ఆ కోలాటంలో పాడిన ప్రతి పాటా అన్నమయ్య సంకీర్తనే.జాజర పాటలు కూడా పాడారు.రెండు నిముషాలని కూర్చున్న నేను గంట పైగా చూస్తూ ఉండిపోయాను.టి.టి.డి.వారి ఆర్ధిక సహాయంతో జరిపిస్తున్నా రనుకుంటాను. చాలా బాగా ఎంజాయ్ చేసాను.అందరితో ఆ ఆనందాన్ని పంచుకోవాలనిపించింది.అందుకని ఇది వ్రాసాను.
Aug 19, 2008
జగన్మోహనాకార చతురుఁడవు పురుషోత్తముఁడవు
Posted by
Unknown
Subscribe to:
Post Comments (Atom)
4 comments:
చాలా రోజుల తర్వాత దర్శనం.ఈమధ్య టీ.వీ లో చూశాను టి.టి.డి వారి గోశాలలో అన్నమయ్య కీర్తనలను పెడుతున్నప్పటినుంచి గోవులు మామూలుగా 6-8 లీటర్ల పాలిచ్చేటివి ఏకంగా 12 లీటర్ల పైన పాలిస్తున్నాయంట.
కీర్తన చాలా బావుంది - మీరు ఉదహరించిన భక్తులను దాస భక్తులంటారు. వీరు అన్నమయ్య కీర్తనలను ప్రజా బాహుళ్యంలోకి తీసుకుని వెళ్ళటం ద్వారా శ్రీవారి సేవ చేస్తుంటారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో వీరి కోలాటాల ఊరేగింపును చూడండి - ఈ దాస భక్తుల గురించి పూర్తి వివరాలకు పీ.వీ.ఆర్.కే.ప్రసాద్ గారు రాసిన 'నాహం కర్తా - హరి కర్తా' అనే పుస్తకం లో చూడండి !
వీరికి టీ టీ డీ వారి ధర్మ ప్రచార పరిషత్తు వారి మద్దతు ఉంది.
@విజ.మోహన్ గారూ కంప్యూటరు మోడెమ్ వగైరా పాడవటంవల్ల ఓ 20 రోజులపాటు మీ అందరికీ దూరంగా వుండవల్సొచ్చి చాలా బాధ పడ్డాను.అప్పటికి కాని ఈ బ్లాగు వ్యసనానికి ఎంతగా బానిసనయ్యానో తెలియరాలేదు.
మీరు వ్రాసినట్టు సంగీతం లోను, భక్తిలోను ఆ రెంటికలయికయైన అన్నమయ్య కీర్తనలకా మహత్తు ఉంది.డైరీ ఫారాల్లో సినిమా పాటల రికార్డులను ప్లే చేస్తారని విన్నాను.అన్నమయ్య కీర్తనలు కూడా అక్కడ తొందరలో చోటుచేసుకోవచ్చనుకుంటా.
@సుజాత గారూ
ఆ పుస్తకం వేట మొదలుపెట్టాను.దొరగ్గానే చదివి ముచ్చటిస్తాను.ఇంతకీ మీరడిగిన కీర్తన పోస్టుచేసాను.చూసారా?
సుజాత గారూ నిన్నను మొన్నను హైదరాబాదులో విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ లో "నాహం కర్తాః హరిః కర్తాః"పుస్తకాన్ని కొని హైదరాబాదులో అక్కడుండంగానే పూర్తిచేసాను.ఎందుకో కారణం తెలీదు గానీ చదువు తుంటే చాలా చోట్ల మనసు ఆర్ద్రమై కళ్ళల్లోనుండి కన్నీరు ధారాపాతమయ్యేది.ఇటువంటి పుస్తకం గురించి తెలియజేసినందుకు హార్దిక ధన్యవాదాలు.
Post a Comment