గుండక్రియ
దాఁచుకో నీ పాదాలకుఁ దగ నేఁ జేసిన పూజ లివి
పూఁచి నీ కీరితిరూపపుష్పము లివి యయ్యా। ॥పల్లవి॥
వొక్క సంకీర్తనే చాలు వొద్దికై మమ్ము రక్షించఁగ
తక్కినవి భండారాన దాఁచి వుండనీ
వెక్కసమగు నీ నామము వెల సులభము ఫల మధికము
దిక్కై నన్నేలితి విఁక నవి తీరని నా ధనమయ్యా। ॥ దాఁచుక
నా నాలికపై నుండి నానా సంకీర్తనలు
పూని నాచే నిన్నుఁ బొగడించితివి
వేనామాల వెన్నుఁడా వినుతించ నెంతవాఁడ
కానిమ్మని నా కీపుణ్యము గట్టితి వింతేయయ్యా। ॥ దాఁచుకో॥
యీ మాట గర్వము కాదు నీ మహిమే కొనియాడితిఁగాని
చేముంచి నా స్వాతంత్ర్యము చెప్పినవాఁడఁ గాను
నేమానఁ బాడేవాఁడను నేరములెంచకుమీ
శ్రీమాధవ నే నీదాసుఁడ శ్రీవేంకటేశుఁడవయ్యా. ॥ దాఁచుకో॥ ౨-౩౩౮
చాలా ప్రసిద్ధమైన అన్నమయ్య కీర్తనలలో ఇది ఒకటి।
ఈ సంకీర్తనలు నీ పాదాలకు తగినవిధంగా నేను చేసిన పూజలివి। ఇవి నేను నీకు సమర్పించే పూచిన నీ కీర్తిరూపములైన పుష్పములయ్యా.
మమ్మల్ని ఒద్దికగా రక్షించడానికి వీటిలో ఒక్క సంకీర్తనే చాలు।తక్కినవి భండారాన దాచి వుండనీ।అధికమైన నీ నామము యొక్క వెల సులభము, ఫలమధికము।నీవు నాకు దిక్కై నన్ను ఏలావు।అవి నా తీరని ధనమయ్యా।
నా నాలికపై నిలచి నీవు పూనుకొని నాతోఎన్నో సంకీర్తనలతో నిన్ను పొగడించికొనినావు। వేయి నామాల వెన్నుడా నిన్నునుతించగా నే నెంతవాడను।నీవే కానిమ్మని నాకు ఈ పుణ్యాన్నికట్టావింతేనయ్యా।
ఈ మాట గర్వముతో చెబుతున్నది కాదు।నీ మహిమనే నేను కొనియాడేను కాని వేఱు కాదు।
చేముంచి(?) నా స్వాతంత్ర్యము చెప్పినవాడ కాను।నియమంతో పాడే వాడిని।నేరములెంచకువయ్యా। ఓ శ్రీ మాధవా! నేను నీ దాసుడనయ్యా!నీవు నా పాలి శ్రీవేంకటేశ్వరుడవు.
లాస్ ఏంజెల్స్ దావాగ్నికాండ : వనం జ్వాలా నరసింహారావు
13 hours ago
4 comments:
నరసింహ గారికి
అన్నమాచార్యుల కీర్తనలలో ఈ కీర్తన, అంతర్యామి అలశితి అన్న కీర్తనలు అంటే నాకు చాలా చాలా ఇష్టం. బహుసా ఈ కీర్తనలలో కనిపించే ఆర్ధ్రత అత్యంత ఉత్కృష్టమైనదని నా భావన.
ఒక జీవితాన్ని భక్తికి పణంగా పెట్టి ఆ ప్రక్రియలో ముంచుకొచ్చిన వార్ధక్యాన్ని వ్యక్తీకరించటానికి ఇంతకు మించిన పదభంధాలు కానీ, వర్ణనలు కానీ మరెక్కడా మనకు కనిపించవేమో.
అంతర్యామి కీర్తన సుబ్బలక్ష్మి గొంతులో వింటూంటే కలిగే రసావేశం ఎస్పీ లో నాకు కనిపించలేదు. (పెద్దలు క్షమించాలి)
ఈ కీర్తనకు మీరు వివరణ ఇవ్వకపోయినా నేను అర్ధం చేసుకోగలను. ఎందుకంటే ఇదివరకే దీనిపై కొంత హోం వర్క్ వెయ్యటం జరిగింది. అయినప్పటికీ మీ వివరణ అదిరింది.
అంతర్యామి కీర్తన ఎప్పుడు పరిచయం చేస్తారు.
బొల్లోజు బాబా
మీ వివరణతో అన్నమయ్య హృదయలోతులను చూపిస్తున్నారు
@బాబా గారూ నెనరులు.అంతర్యామీ కీర్తన సుబ్బులక్ష్మి గారిది వినే భాగ్యం నా కింతవరకూ కలగలేదు.ఆ విషయంలో మీరు భాగ్యవంతులే.మీరు కోరిన ఆ కీర్తనను ఈ రోజే మీ కోసం పోస్టు చేసాను.గమనించగలరు.
సుబ్బులక్ష్మి గారి "వందే వాసుదేవం" సి.డి.లోని కీర్తనలను కంప్యూటరు మీద పనిచేస్తున్నంతసేపు వింటూనే వుంటాను.ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలనే వుంటాయి.
@విజయమోహన్ గారూ అన్నమయ్య హృదయలోతులను చూపించడం మనలాంటి వారికి సాధ్యమయ్యేపని కాదు.ఏదో అర్ధంచేసుకొని ఆనందించగలగటమే మనందరం చెయ్యగలిగేది.
నరసింహ గారు
మెయిల్ పంపించాను గమనించండి.
బొల్లోజు బాబా
Post a Comment