నాహం కర్తాః హరిః కర్తా తత్పూజా కర్మ చాఖిలం తదాపి మత్కృతా పూజా తత్ప్రసాదేన నా అన్యథా

Jul 19, 2008

కులుకక నడవరో కొమ్మలాలా

Get this widget | Track details | eSnips Social DNA




దేసాళం
కులుకక నడవరో కొమ్మలాలా
జలజలన రాలీని జాజులు మా యమ్మకు పల్లవి

ఒయ్యనే మేను గదలీ నొప్పుగా నడవరో
గయ్యాళి శ్రీపాదతాఁకు కాంతలాలా
పయ్యెద చెఱఁగు జారీ భారపు గుబ్బలమీఁద
అయ్యో చెమరించె మా యమ్మకు నెన్నుదురు కులు

చల్లెడి గందవొడి మైజారీ నిలువరో
పల్లకి వట్టిన ముద్దుఁ బణఁతులాల
మొల్లమైన కుందనపు ముత్యాల కుచ్చులదర
గల్లనుచుఁ గంకణాలు గదలీ మా యమ్మకు కులు

జమళి ముత్యాలతోడి చమ్మాళిగ లిడరో
రమణికి మణుల నారతులెత్తరో
అమరించె కౌఁగిట నలమేలుమంగనిదె
సమకూడె వేంకటేశ్వరుఁడు మా యమ్మకు కులు ౫-౭౩

అన్నమయ్య- అలమేలు మంగ చెలులు మోస్తున్న పల్లకిలో శ్రీవారిని చేరే సన్నివేశాన్ని వర్ణిస్తున్నాడు।
పల్లకీ వెంట ఇరుపక్కలా నడచి వస్తున్న చెలికత్తెలు పల్లకీని మోస్తూన్న చెలులతో అలమేలు సౌకుమార్యాన్ని గురించి ఈ విధంగా అంటున్నారు।
ఓ కొమ్మల్లారా! మరీ అంత కులుకుతూ నడవకండే, మా అలమేల్మంగమ్మకు కురులలో పెట్టుకొన్న జాజులు జలజలా రాలిపోతున్నాయే! కొంచెంగానే శరీరాల్నికదలిస్తూ ఒప్పుగా నడవండే।మన గయ్యాళి శ్రీపాదాల్ని తాకుతున్నదే అమ్మల్లారా। ఆవిడకు భారమైన చనుగవ మీది పైటకొంగు క్రిందికి జారుతోందే! అంతేకాదు,అయ్యో !మా అమ్మ నెన్నుదురు కూడా చెమరిస్తోందే!
కొంచెం నిలవండే!ఆమె పైన చల్లిన మంచిగంధపు పొడి శరీరాన్నుండి జారిపోతుందే! ఓ పల్లకీ పట్టిన ముద్దు పణతుల్లారా కొంచెం ఆగండే! అధికమైన కుందనపు ముత్యాల కుచ్చులు అదురుతుండగా,మా యమ్మ చేతి కంకణాలు గల్లుమంటూ కదలుతున్నాయే!
మా యమ్మకు ముత్యాలు పొదిగిన పావుకోళ్ళని ఇవ్వండే।ఈ రమణికి మణిదీపాల హారతులెత్తండే!
శ్రీ వేంకటేశ్వరు డిదే అలమేల్మంగని కౌగిట చేరుస్తున్నాడే.

7 comments:

సుధాకర బాబు said...

ఈ పాట ఇంతకుముందు చాలా సార్లు విన్నాను గాని అర్ధం తెలిసేది కాదు. ఇప్పుడు కాస్త తెలుస్తున్నది. నెనర్లు .

"గయ్యాళి శ్రీపాదాల్ని తాకుతున్నది" అంటే ఇంకా అర్ధం కావడంలేదండి.

Unknown said...

సుధాకర బాబు గారూ నెనర్లు.
ఎక్కువగా కులుకుచూ పల్లకీ మోస్తున్న చెలికత్తెలు నడుస్తుంటే ఆ కుదుపునకు అలమేలుమంగ ఆమెకు పల్లకిలో ఎదురుగా వున్న శ్రీవారి(విగ్రహం?)పాదాలను తాకుచున్నదని అర్థం అనుకుంటున్నాను.నాకు తోచినది ఇది.ఇంకో అర్థం ఏవైనా వుంటే ఎవరైనా పెద్దలు తెలియ జేస్తే సంతోషిస్తాను.

Bolloju Baba said...

narasimha gaaru
kIrtana chaalaa baaguMdi. mIvivarana valla kIrtana naaku caalaa baagaa ardhamayyimdi. thankyou
bollojubaba

Unknown said...

బాబా గారూ నెనరులు.సంకీర్తనలకు వివరణను వ్రాయడం వలన నేను చాలా చాలా నేర్చుకోగలుగుతున్నాను.మీ వంటివారి ప్రోత్సాహం నా సంతోషాన్ని ద్విగుణీకృతం చేస్తుంది.

Sujata M said...
This comment has been removed by the author.
Sujata M said...

బావుంది. నాకు తెలిసిన అర్ధం ఇది. ఈ పాటలో అన్నమయ్య అలమేలుమంగను నవ వధువు గా సింగారించి, పల్లకి లో కళ్యాణ వేదిక కు తరలించినట్టు భావించవచ్చు.

కొత్త పెళ్ళికూతురు పల్లకి లో కూర్చున్నది. కుసుమకోమలి కూర్చున్న పల్లకీని బిరుసు బోయీలు మోయ్యుటను ఈ మృదు హృదయుడు సహింపలేకపొయినాడు కాబోలు ! పల్లకీ మోతకు ముద్దు పణతులను నియోగించినాడు. వాళ్ళు మంగమ్మ పాదదాసీలు. పల్లకీ కళ్యాణ వేదిక వైపు సాగింది. పల్లకీ పట్టిన మిసిమిగత్తెలు విసవిస నడచినారు. పల్లకీ కుదింపులకు కలిమిజవరాలు కంపించిపోయినది. ఆమె నెరులు చెదరినవి - విరులు జల జల రాలినవి. రాలిన జాజులను చూచిన అన్నమయ్య శరీరమే జలదరించినది. ఆ మదమరాళగమనలను హెచ్చరించాడు !

ఓ కొమ్మలాల ! గయ్యళులాల ! కులుకక నడవండి. మా చిన్నితల్లి మేను కదిలీని, పయ్యెద చరగు జారీని, భారపుగుబ్బలు బయటపడీన్ని, నుదురు చెమరించీని.'

మదవతులు ముందుకు కదిలినారు. ఆ గజగమనులకు గమనవిలాసాలు తప్పలేదు. పల్లకీ కుదింపులూ తగ్గలేదు. అన్నమయ్య వాళ్ళను నిలిపినాడు. మృదువుగా మందలించినాడు. 'ఓ ముద్దుగుమ్మలారా - కొంచెము నెమ్మదిగా నడవండే ! అటుచూడండి. నా బంగారుతల్లి పాపటలో చల్లిన గందవొడి శరీరమంతా జారింది. ధరించిన ముద్దుల ముత్యాల కుచ్చు అదరింది. కంకణాలు కదలి కిసలయపాణి ఎంత కందిపోయిందో !' ఆ భామలు ముసిముసి నగవులతో ముందుకు సాగినారు. పల్లకి కళ్యాణ వేదిక చేరింది. ఇందిరా సుందరాంగికి ముత్యాల పావుకోళ్ళు పెట్టరో ; రమణికి మణుల హారతులెత్తరో - అని చెలికత్తెలను పురమాయించినాడు.

అలమేలుమంగా శ్రీనివాసుల కళ్యాణం అంగరంగవైభవంగా జరిపించినాడు. శేషగిరీశ్వరుని కాళ్ళు కడిగి కన్యాదానం చేసినాడు.

- Keerthi Seshulu Sree Raalla Palli Ananta Krishna Sarma gaari vivaraNa

Unknown said...

సుజాత గారూ రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ గారి వివరణ అందించి నందులకు మీకు కృతజ్ఞతలు.దీనిలోకూడా గయ్యాళి శ్రీపాదతాకు అనే దానికి అర్ధం తెలియలేదు.

ధర్మో రక్షతి రక్షితః

ధర్మాన్ని రక్షించండి. అది మిమ్మల్ని రక్షిస్తుంది.

విషయసూచిక

నాకిష్టమైనవి

ప్రస్తుత వీక్షకులు

నా ప్రపంచం

అతిథి దేవో భవః

స్వపరిచయం

 
నరసింహ - Template By Blogger Clicks