నాదరామక్రియ
కోరిన కోరికెలెల్లా కొమ్మయందే కలిగీని
చేరి కామయజ్ఞ మిట్టే సేయవయ్యా నీవు. IIపల్లవిII
సుదతి మోవి తేనెలు సోమపానము నీకు
పొదుపైన తమ్ములము పురోడాశము
మదన పరిభాషలు మంచి వేదమంత్రములు
అదె కామయజ్ఞము సేయవయ్యా నీవు. IIకోరినII
కలికి పయ్యద నీకు కప్పిన కృష్ణాజినము
నలువైన గుబ్బలు కనకపాత్రలు
కలసేటి సరసాలు కర్మ తంత్ర విభవాలు
చెలఁగి కామయజ్ఞము సేయవయ్యా నీవు. IIకోరినII
కామిని కాఁగిలి నీకు ఘనమైన యాగశాల
ఆముకొన్న చెమటలే యవబృథము
యీ మేరనే శ్రీవెంకటేశ నన్ను నేలితి
చేముంచి కామయజ్ఞము సేయవయ్యా నీవు। IIకోరినII २९-२१६
స్త్రీ పురుష సంభోగాన్ని కామయజ్ఞం గా భావించి చెప్పిన సంకీర్తనమిది।
నీవు కోరిన కోరికలన్నీ ఆ కొమ్మ యందే కలిగి వున్నాయి। ఆమెతో చేరి కామయజ్ఞాన్ని ఈ విధంగా చేయవయ్యా నీవు।
సుదతి పెదవి యందలి తేనెలు నీకు యజ్ఞములో చేసే సోమపానము। పొదుపైన తాంబూలము పురోడాశము (యజ్ఞార్ధమైన ఆపూపము)। మదన పరిభాషలు (నిందా సహితమైన యుపాలంభము-పరార్ధ వివేచకాచార్యులయొక్క యుక్తి యుక్తవాక్కు) మంచి వేదమంత్రములు గాను-అదె కామయజ్ఞము నీవుచేయవయ్యా ।
కలికి వైటకొంగు నీవు పైన కప్పిన కృష్ణాజినము। ఒప్పిదమైన ఆమె గుబ్బలు బంగారు పాత్రలు। కలసేటి సరసాలు యజ్ఞకర్మ తంత్రములోని వైభవాలుగాను ఉత్సహించి నీవు కామయజ్ఞమును సేయవయ్యా।
కామిని కౌగిలే నీకు ఘనమైన యజ్ఞశాల, రతిక్రియలో అలముకొన్న చెమటలే అవబృథము(ముకడ యజ్ఞపట న్యూనాతిరిక్త దోషపరిహారార్ధము చేయుకర్మము)గాను ,యీ రీతిగా ఓ శ్రీవేంకటేశ్వరా నన్ను నీ వేలితివి। చేముంచి(?) నీవు కామయజ్ఞమును సేయవయ్యా।
Jul 16, 2008
కోరిన కోరికెలెల్లా కొమ్మయందే కలిగీని
Posted by
Unknown
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment