|
సామంతం
చెప్పరాని మహిమల శ్రీదేవుఁడితడు
కప్పి కన్నులపండుగగాఁ జూడరో. IIపల్లవిII
అద్దుచుఁ కప్పురధూళి యట్టె మేన నలఁదఁగా
వొద్దిక దేవునిభావ మూహించితేను
మద్దులు విరిచినట్టి మంచి బాలకృష్ణునికి
మద్దులకాంతి మేన మలసినట్టుండె. IIచెప్పII
అమరఁ దట్టుపుణుఁగు అవధరించఁగాను
తమితోఁ బోలికలెల్లఁ దచ్చి చూడఁగా
యమునానది నాఁగేట నండకుఁ దీసుకొనఁగా
యమునానది నలుపు అంటినయట్టుండె. IIచెప్పII
అంగముల శ్రీవేంకటాధిపున కింతటాను
సింగారించి సొమ్ములెల్లఁ జలరేఁగఁగా
బంగారపుటలమేలుమంగ నురాన నుంచగా
బంగారము మేననెల్లాఁ బరగినట్టుండె. IIచెప్పII ౩-౧౬౬
0 comments:
Post a Comment