|
భూపాళం
ఏమి చిత్రం బేమి మహిమలు యేమి నీ మాయావినోదము
వామనాచ్యుత నిన్నుఁ దెలియఁగ వసుధలో మాతరములా। IIపల్లవిII
సకలలోకనివాసనాయక శౌరి మురహర నరహరీ
ప్రకటమాయెను నీ గుణంబులు పాలముచ్చ వటంచును
వికటముగ నినుఁ గన్నతల్లి వేల నీ వదనంబు మీఁటిన
అకట హా యని నోరుఁ దెరచిన యందు లోకము లుండెను। IIఏమిII
శ్రీసతీపతి దైత్యదానవశిక్ష కామర రక్షక
రాసి కెక్కెను బండిరొప్పిన రవ్వలా నీ సేఁతలు
మోసమున నర్జునుఁడు నీలో ముందు గానక మాటలాడిన
వాసవార్చిత విశ్వరూపము వసుధఁ జూపితి వవుదువు। IIఏమిII
నమో నమో శ్రీవేంకటేశ్వర నారదప్రియ భక్తవత్సల
విమలమగు నా దాసు లిదె నీ విద్య లెల్లాఁ జూచిరి
సుముఖులై కరి శబరి బలియును శుక ధ్రువాదులు నిన్నుఁ గొలువఁగ
సమత వున్నతపదము లొసఁగితి సర్వమిందునుఁ గంటిమి। IIఏమిII ౧౫-౨౧౬
0 comments:
Post a Comment