నాహం కర్తాః హరిః కర్తా తత్పూజా కర్మ చాఖిలం తదాపి మత్కృతా పూజా తత్ప్రసాదేన నా అన్యథా

Nov 23, 2008

లేరా దేవతలూ లేరా లావరులూ

గౌళ
లేరా దేవతలూ లేరా లావరులూ
ఆరీతి నాఁ డెందు వోయి రధికులే కలిగితే IIపల్లవిII

మొదల సృష్టికి నెల్ల మూలమైన బ్రహ్మదేవుని
యిదె నాభిఁ బొడమించే నచ్యుతుఁడే
తుదఁ బ్రళయమునందు దొంతులుగా జగములు
వుదరమునందు నించె నొక్కఁడే నిలిచి. IIలేరాII

మోవలేక దేవతలు ములుగఁగ మందరము
తోవ మోచి తెచ్చినట్టి దొరవిష్ణువే
వేవేగ జలధిలోన వేసితే కుంగిన కొండ
ఆవల వీఁపున నెత్తె నాదికూర్మ మితఁడే.IIలేరాII

తనబంటు శేషుని తరితాడు గావించి
కొననాధారమై నిలిచె గోవిందుఁడే
దనుజులు దేవతలు తచ్చి తచ్చి యలసితె
వెనక నంతయుఁ దచ్చె విశ్వరూపుఁడితఁడే.IIలేరాII

కాలకూటమున కీశుఁ గంచముగాఁ జేసి మింగి
చాలి నీలవర్ణుఁ డాయె శశివర్ణుఁడే
కాలకంఠుఁ డాయెను శంకరుఁడు పాత్రయిన వంక
పోలింప ఋగ్వేద మిదె పొగడీ నితనిని.IIలేరాII

అమరఁ దనయిచ్చ నమృతము పంచిపెట్టె
నమరుల కెల్లా నారాయణుఁ డితఁడె
నెమకి తా ననువైన నిర్మల కౌస్తుభము
కమలముపై లక్ష్మిఁ గై కొనె నీ ఘనుఁడె.IIలేరాII

మూలమని నుడిగితే మోచివచ్చి కరిఁగాచె
కోలుముందై యిందరిలో గోవిందుఁడే
తూలిన శృతులు దెచ్చి తుంగిన(?) భూమియెత్తె
అలరి భస్మాసురుని నడఁచె నీ దేవుఁడే.IIలేరాII

యిందు మౌళిపై నేసి యింద్రియములఁ గట్టిన
కందర్పజనకుఁడైన కమలాక్షుఁడే
కందువ పాదతీర్థపు గంగ హరు శిర మెక్కె
యెందును దైవ మితఁడే యిందిరానాథుఁడు.IIలేరాII

మాయలెల్లా నితనివె మహిలో సంకల్పములు
యేయెడ 'శ్రీవిష్ణురాజ్ఞ' యీతనిదే
తోయరాని చక్రముచే దుర్వాసు వారఁగాను
దాయి దండై బ్రదికించె తనబంటు చేత.IIలేరాII

సంది నన్ని మతముల సన్యాసులకు గతియై
అందరి నోళ్ళకు నారాయణు నామమే
ముందు సంధ్యాజపముల మూలపు టాచమనము
అందుల కితని కేశవాది నామములె.IIలేరాII

వాదుల 'నదైవం కేశవాత్పర'మని తొల్లి
వేదవ్యాసు లనిన విభుఁ డీ హరి
సోదించి వశిష్టుఁడును శుకనారదాదులు
పోదితోడ దాసులైరి పురుషోత్తమునికి.IIలేరాII

బాణాసురుని నఱికి భంగపడఁగా విడిచె
వేణునాద ప్రియుఁడైన విఠ్ఠలుఁడే
బాణమై త్రిపురములు భస్మీకరము చేసె
ప్రాణుల రక్షించే నీ పరమాత్ముఁడే.IIలేరాII

ఆపదలందినవేళ యసురబాధలు మాన్ప
చేపట్టి లోకము గాచే శ్రీపతియే
పై పై నింద్రాదులకు పారిజాతాదిసిరులు
వైపుగాఁ గాయించిన వరదుఁడు నితఁడే.IIలేరాII

భూమి యీతనిసతి యంబుధు లితని పరపు
సోమ సూసౌదు లితని చూపుఁగన్నులు
వేమరు నూర్పులే గాలి విష్ణుపద మాకాశము
వాములైన హరి నీ వాసుదేవుఁడే.IIలేరాII

హరునిఁ బూజించవలె నంటె నర్జునునకు
సిరులఁ బాదము చాఁచె శ్రీకృష్ణుఁడే
అరిది మార్కండేయుఁ డతని మహిమ చూచి
వరదై నా మితఁ డని వాదించి కొలిచె.IIలేరాII

ధృవపట్ట మితఁ డిచ్చె దొరకొని శరణంటే
వివరింప నిదివో శ్రీవేంకటేశుఁడే
యివల నితనిఁ జెప్ప నెవ్వరి వశము లింక
భువిఁ బార్వతి హరినిఁ బొగడేటినాఁడు.IIలేరాII

0 comments:

ధర్మో రక్షతి రక్షితః

ధర్మాన్ని రక్షించండి. అది మిమ్మల్ని రక్షిస్తుంది.

విషయసూచిక

నాకిష్టమైనవి

ప్రస్తుత వీక్షకులు

నా ప్రపంచం

అతిథి దేవో భవః

స్వపరిచయం

 
నరసింహ - Template By Blogger Clicks