|
శ్రీరాగం
ఒకపరి కొకపరి కొయ్యారమై
మొకమునఁ గళలెల్లా మొలచిన ట్లుండె IIపల్లవిII
జగదేకపతిమేనఁ జల్లిన కర్పూరధూళి
జిగిగొని నలువంకఁ జిందగాను
మొగిఁ జంద్రముఖి నురమున నిలిపెఁ గనక
పొగరువెన్నెల దీగఁబోసిన ట్లుండె. IIఒకII
పొరి మెఱుఁగుఁజెక్కులఁ బూసిన తట్టు పుణుఁగు
కరఁగి యిరుదెసలఁ గారగాను
కరిగమనవిభుఁడు గనక మోహమదము
తొరిగి సామజసిరి దొలఁకిన ట్లుండె. IIఒకII
మెఱయ శ్రీవేంకటేశుమేన సింగారముగాను
తఱచయిన సొమ్ములు ధరియించఁగా
మెఱుఁగుఁబోణి యలమేలుమంగయుఁ దాను
మెఱపుమేఘము గూడి మెఱసిన ట్లుండె.IIఒకII౧౭-౪౮౫
0 comments:
Post a Comment