గౌళ
నీ చిత్తము కొలఁది నే నడచుటింతే కాక
యేచి సిగ్గు విడువఁగ నిల్లాలికి సంగతా IIపల్లవిII
కొంకక నేనే నీ కొంగు వట్టి తీసితేను
అంకెల నిదెంతగయ్యా ళనకుండేవా
మంకుల నెన్ని సేసినా మగవాని కమరును
జంకించి యాఁటదానికి చలివాయఁ జెల్లునా. IIనీ చిత్తII
వొద్దనుండి నిన్నుఁజూచి వూరకే నే నవ్వితేను
అద్దో యిదెంతగబ్బి యనకుండేవా
కొద్ది మీరి యెట్టుండినాఁ గోడెకాఁడ నీ కమరు
చద్ది బింకము రాణివాసములకుఁ దగునా. IIనీ చిత్తII
ముంచి నేనే నీకాఁగిలి మోరఁగకడిగితేను
అంచెల నిదెంతదిట్ట యనకుండేవా
కొంచక శ్రీవేంకటేశ కూడితి వింతలో నీవె
మించిన పట్టపుదేవి మేర మీరఁ జెల్లునా. IIనీ చిత్తII ౧౪-౩౪౯
నేను నీ చిత్తము వచ్చిన విధంగా నడుచుటే - కాక, అంతకన్నా అతిశయించి సిగ్గు విడచుట ఇల్లాలయిన దానికి తగునా?
కొంకక నే నీ కొంగు పట్టి తీసితే నన్ను "ఇదెంత గయ్యాళి" అని అనకపోయేవా? మంకుదనంతో ఎన్ని చేసినా మగవాడిని కనక నీకూ అమరుతుంది.కాని ఆడదానిని కాబట్టి నాకు బెదిరించి బుజ్జగించ చెల్లుతుందా?
నేను నీ దగ్గరనుండి వూరకే నవ్వితే- "అబ్బో, యిదెంత గబ్బిది" అని అనకపోయేవా? కొంచెం అటూఇటూ ఎటుండినా కోడెకాడవు కాబట్టి నీకు సరిపోతుంది.కాని రాణివాసంలో ఉండేవారికి అలా బింకముగా నుండుట వీలయ్యేనా?
అతిశయించి నేనే నీ కవుఁగిలి ముఖం ఎత్తిపెట్టి అడిగితే "ఇది యెంత దిట్ట"ది అని అనకుండేవా? ఇంతలో నీవే శ్రీవేంకటేశ్వరా నన్ను
కూడితివి. పట్టపు దేవినైన నాకు మేర మీరుటకు చెల్లుతుందా?
Nov 9, 2008
నీ చిత్తము కొలఁది నే నడచుటింతే కాక
Posted by
Unknown
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment