సామంతం
నీతితో నడచితేను నొగులే లేదు
జాతి దప్ప కుండితేను చలమే ఫలము. IIపల్లవిII
వొలిసి కై కొంటేను వొగరై నాఁ దీపే
తెలిసితేఁ దనలోనే దేవుఁడున్నాఁడు
పలుకులు మంచివై తే పగవారుఁ జుట్టాలే
చెలఁగి దిష్టించితేను చీఁకటిల్లు వెలుఁగు. IIనీతితోII
నేరిచి బతికితేను నేలెల్లా నిధానము
వోరిచితేఁ దనపంత మూరకే వచ్చు
సారెకు నుతించితేను చట్టైనాఁ గరఁగును
వూరకే గుట్టుననుంటే వూరికెల్లా నెక్కుడు. IIనీతితోII
వాడికె సేసుకొంటేను వలపెల్లా నిలుపౌను
వేడుకతో నుండితే వెనకే ముందౌ (ను?)
యీడులేని శ్రీవేంకటేశ్వరుఁ గొలిచితేను
జాడుపడ్డపనులెల్లా సఫలమౌను. IIనీతితోII ౧౪-౪౨
నీతిగా నడిస్తే నెగులే(బాధే)లేదట.తత్వం తెలిస్తే దేవుడెక్కడో లేడు,తనలోనే ఉన్నాడట.మన మాటలు మంచివైతే పగవారైనా మనకు చుట్టాలే అవుతారట.ఉత్సహించి ఉపదేశిస్తే జ్ఞానోదయమే(చీకటిల్లు వెలుగు)అవుతుంది.
నేర్పుతో బ్రతకటం తెలిస్తే భూమిమీద యెక్కడైనా బ్రతికేయొచ్చు.ఓర్పుగా ఉంటే తన పంతము దానికదే నెరవేర్తుంది.మాటిమాటికి ప్రార్ధిస్తే చివరికి రాయైనా కరుగుతుంది.వూరకే గుట్టుగా ఉంటే చాలు మనం మన ఊరిలోవారందరికంటే ఎక్కువే.
అలవాటు చేసికొంటే వలపంతా స్థిరమౌతుంది.వేడుకగా నుంటే వెనకటిదే ముందునకౌతుంది.సాటిలేని శ్రీవేంకటేశ్వర స్వామిని కొలిస్తే గింజ పట్టని జొన్నకర్ర సైతము పూర్తిగా ఫలిస్తుంది.(అన్నిపనులూ చక్కబడతాయన్నమాట)
Nov 4, 2008
నీతితో నడచితేను నొగులే లేదు
Posted by
Unknown
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment