నాట
వినరయ్య నరసింహ విజయము జనులాల
అనిశము సంపదలు నాయువు నొసఁగును. IIపల్లవిII
మొదలఁ గొలువుకూటమున నుండి కశిపుఁడు
చదివించెఁ బ్రంహ్లాదుని శాస్త్రములు
అదన నాతఁడు నారాయణుఁడే దైవమనె
అదరిపడి దైత్యుఁడు ఆతనిఁ జూపుమనె. IIవినరయ్యII
అంతటఁ బ్రంహ్లాదుఁడు 'అన్నిటానున్నాఁ'డనియె
పంతమున దానవుఁడు బాలునిఁ జూచి
యెంతయుఁ గడఁకతోడ 'ఇందులోఁ జూపు'మని
చెంతనున్న కంబము చేతఁగొని వేసె. IIవినరయ్యII
అటమీఁదట బ్రహ్మాండం బదరుచు
కుటిలభయంకరఘోషముతో
చిట చిట చిటమని పెట పెట పెటమని
పటపట మనుచును బగిలెఁ గంబము. IIవినరయ్యII
కులగిరు లదరెను కుంభిని వడఁకెను
తలఁకిరి దైత్యులు తల్లడిలి
కలఁగెను జగములు కంపించె జగములు
ప్రళయకాలగతిఁ బాటిల్లె నపుడు. IIవినరయ్యII
ఘననారసింహుఁ డదె కంబమునందు వెడలె
కనుపట్టె నదిగొ చక్రజ్వాలలు
మునుకొని వెడలెఁ గార్ముకముక్తశరములు
కనకకశిపునకుఁ గలఁగె గుండియలు. IIవినరయ్యII
అడరె నద్దేవునికోపాగ్నులు బెడిదపు-
మిడుఁగురులతోడుత మిన్నులుముట్టి
పిడుగులు రాలేటి భీకర నఖరములు
గడుసు రక్కసునికి గాలములై తగిలె. IIవినరయ్యII
తొడికి పట్టి విష్ణుఁడు తొడమీఁద నిడుకొని
కడుపు చించెను వాని గర్వమడఁగ
వెడలెఁ జిల్లున వానివేఁడి నెత్తురు నింగికి
పొడి వొడియాయ శత్రుభూషణములెల్లను. IIవినరయ్యII
నెళ నెళన విరిచె నిక్క వాని యెముకలు
పెళ పెళ నారిచి పెచ్చు వెరిగె హరి
జళిపించి పేగులు జంద్యాలుగ వేసుకొనె
తళుకుఁగోరలు తళతళమని మెరిచె. IIవినరయ్యII
పెటలించి నరములు పెరికి కుప్పలు వేసి
గుటగుటమని రొప్పె గోవిందుఁడు
చిటిలించి కండలు చెక్కలు వారఁజెండి
కుటిలదానవుఁ జూచి 'ఖో'యని యార్చెను. IIవినరయ్యII
తెంచి శిరోజములు దిక్కులకు వాని-
పంచప్రాణములుగొనెఁ బరమాత్ముఁడు
అంచెల నీరీతిని ప్రంహ్లాదునిపగ నీఁగె
మించి దేవతలు మితిమీఱి జయవెట్టిరి. IIవినరయ్యII
అప్పు డిందిరాదేవి యంకమునఁ గూచుండె
వొప్పుగ శాంతమందె నహోబలేశుఁడు
తప్పక కోనేటిదండఁ దానై యిందును నందు
చిప్పిలి వరములిచ్చీ శ్రీవేంకటేశుఁడు. IIవినరయ్యII
అనిశము=ఎల్లప్పుడు
అదన=? (అప్పుడు?)
కడకతోడ=ప్రయత్నముతోడ
కార్ముకముక్తశరములు=వింటినుండి వెలువడిన బాణములు
అడరె=అతిశయించె
బెడిదపు=భయంకరమైన,అధికమైన
నఖరములు=గోళ్ళు
తొడికి=ఒడిసి
నెళ నెళన=విఱుగుటయందగుధ్వన్యనుకరణము
నిక్క=నిశ్చయముగా
అంకము=ఒడి
Oct 25, 2008
వినరయ్య నరసింహ విజయము జనులాల
Posted by
Unknown
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
Thanks for this lyrics with meaning
దన్యవాదములు
Post a Comment