నాహం కర్తాః హరిః కర్తా తత్పూజా కర్మ చాఖిలం తదాపి మత్కృతా పూజా తత్ప్రసాదేన నా అన్యథా

Jul 21, 2008

ఎంచి చూడరో ఘనులార యిందీవరాక్షుఁడు రక్షకుఁడు

దేసాక్షి
ఎంచి చూడరో ఘనులార యిందీవరాక్షుఁడు రక్షకుఁడు
సంచితముగ నితనిశరణంబే సర్వఫలప్రద మిందరికి। ॥ పల్లవి॥

హరిఁ గొలువనికొలువులు మఱి యడవిఁగాసిన వెన్నెలలు
గరిమల నచ్యుతు విననికథలు భువి గజస్నానములు
పరమాత్మునికిఁగానితపంబులు పాతాళములనిధానములు
మరుగురునికిఁగానిపూవులపూజలు మగఁడులేనిసింగారములు। ॥ఎంచి॥

వైకుంఠునినుతియించనివినుతులు వననిధిఁ గురిసినవానలు
ఆకమలోదరుఁ గోరనికోరికె లందనిమానిఫలంబులు
శ్రీకాంతునిపైఁ జేయనిభక్తులు చెంబుమీఁదికనకపుఁ బూఁత
దాకొని విష్ణునితెలియనితెలువులు తగ నేటి నడిమి పైరులు। ॥ఎంచి॥

వావిరిఁ గేశవునొల్లనిబదుకులు వరతఁ గలపుచింతపండు
గోవిందుని కటు మొక్కని మొక్కులు గోడలేని పెనుచిత్రములు
భావించి మాధవుపైలేనితలఁపులు పలు మేఘముల వికారములు
శ్రీవేంకటపతికరుణ గలిగితే జీవుల కివియే వినోదములు। ॥ఎంచి॥ ౨-౨౩౫

పోతన గారి ప్రహ్లాద చరిత్రే గుర్తుకొస్తోందీ సంకీర్తనలో।
ఓ ఘనులారా ఎంచి చూడండో! ఇందీవరాక్షుడే మనలను రక్షించేవాడు। అంతా కూడపెడితే ఇతనిని శరణుకోరడమే ఇందరికి సర్వ ఫలప్రదము।
శ్రీహరిని కొలవని కొలువులు మరి అడవి కాసే వెన్నెలలే। గొప్పవైన కథలు అచ్యుతుని గురించి కాకపోతే అవన్నీ ఈ భూమి మీద గజస్నానములవంటివి।(నిష్ప్రయోజనం- ఏనుగు స్నానం చేసాక తొండముతో దుమ్ముని వంటిమీదంతా చిమ్ముకుంటుంది)
ఆ పరమాత్ముని కొరకు కాని తపస్సులన్నీ పాతాళములోని పాతరల వంటివి. (ఎవ్వరికీ ఉపయోగపడనివి)
మన్మధుని తండ్రికి కాని పూవులపూజలు మగడు లేని సింగారాల్లాంటివి।(ఉపయోగం లేనివి)
వైకుంఠుని కీర్తించని వినతులు సముద్రములో కురిసిన వానలే। ఆ కమలోదరుని కోరని కోరికలు చెట్టు చివారున అందకుండా వుండే ఫలాలు।శ్రీకాంతునిపై చేయని భక్తులు చెంబుమీద వ్రాసిన బంగారుపూతలే।మరగుపడి విష్ణుని తెలిసికోలేని తెలివితేటలు ఏరులో మధ్యగా నాటిన పైరులవంటివి।
క్రమముగా కేశవునొల్లని బ్రతుకులు వరదలో కలసిపోయిన చింతపండు వంటివి।గోవిందునికి మొక్కని మొక్కులు గోడలేకుండా రాసిన పెద్ద పెద్ద చిత్రాలు। భావించగా మాధవునిపై లేని తలపులు మేఘములయొక్క పలు వికారములు।
శ్రీవేంకటేశ్వరుని కరుణ గలిగితే ఇవన్నీ జీవులకు వినోదములవంటివే.
ఈ సంకీర్తన ఛందోలక్షణాల్ని ఎవరైనా చెప్పితే ఎంత బాగుంటుందో కదా.

0 comments:

ధర్మో రక్షతి రక్షితః

ధర్మాన్ని రక్షించండి. అది మిమ్మల్ని రక్షిస్తుంది.

విషయసూచిక

నాకిష్టమైనవి

ప్రస్తుత వీక్షకులు

నా ప్రపంచం

అతిథి దేవో భవః

స్వపరిచయం

 
నరసింహ - Template By Blogger Clicks