|
దేసాళం
గతులన్ని ఖిలమైన కలియుగమందున
గతి యీతఁడే చూపె ఘనగురుదైవము IIపల్లవిII
యీతని కరుణనేకా యిల వైష్ణవులమైతి-
మీతనివల్లనే కంటి మీ తిరుమణి
యీతఁడేకా వుపదేశ మిచ్చె నష్టాక్షరిమంత్ర-
మీతఁడే రామానుజులు యిహపరదైవము. IIగతుII
వెలయించె నీతఁడేకా వేదపురహస్యములు
చలిమి నీతఁడే చూపే శరణాగతి
నిలిపినాఁ డీతఁడేకా నిజముద్రాధారణము
మలసి రామానుజులే మాటలాడేదైవము. IIగతుII
నియమము లీతఁడేకా నిలిపెఁ ప్రపన్నులకు
దయతో మోక్షము చూపెఁ దగ నీతఁడే
నయమై శ్రీవేంకటేశునగమెక్కేవాకిటను
దయఁజూచీ మమ్ము నిట్టే తల్లి తండ్రి దైవము. IIగతుII ౨-౩౭౨
త్రోవలన్నీ చెడిపోయిన యీ కలియుగమునందు మనకు సరియైన మార్గమును ఘనులు,గొప్పదైవము అయిన శ్రీ రామానుజాచార్యులవారే చూపించినారు.
యీతని కరుణ చేతనే కాదా యీ ఇలలో మనము వైష్ణవులమైనాము.యీతనివల్లనే ఈ తిరుమణి(వైష్ణవులు నొసట నిడుకొనే తెల్లని ధవళ మృత్తిక)ని చూడగలిగాము.యీతడే కదా మనకు అష్టాక్షరీ మంత్రము(ఓం నమో నారాయణాయ)ను ఉపదేశించినది.యీయనయే శ్రీరామానుజాచార్యులు మనకు ఇహపరముల రెంటికీ దైవము.
వేదపు రహస్యాలనన్నీ ప్రసిద్ధికెక్కునట్లుగా చేసినదీతడే కదా.చలిమిని(?)యీతడే శరణాగతిని చూపించెను.ఇతడే కదా మనకు నిజముద్రాధారణమును(చేతులకిరుప్రక్కలా భుజముల క్రిందుగా కాల్చిపెట్టిన వైష్ణవముద్రను ధరించుటను నియమముగా)నిలిపినాడు. తిరిగి శ్రీ రామానుజులే మనతో మాటలాడే దైవము.
భక్తిపరులు చేయు శరణాగతి చేయువారికి నియమములనేర్పాటు గావించినదీతడే కదా.తగినట్లు దయతో మోక్షమును చూపించిన దీతడే కదా.అందమైన శ్రీవేంకటేశుని కొండ యెక్కిన మాకు వాకిటిలోనే ఇట్టే దయ చూచే తల్లి,తండ్రి,దైవము శ్రీ రామానుజులే.
4 comments:
"గతులన్ని ఖిలమైన.." బాలకృష్ణ ప్రసాద్, ఆయన కొడుకు కలిసి పాడిన ఈ పాట చాలా ఆహ్లాదకరముగా నున్టుంది.
http://annamacharya-lyrics.blogspot.com/2006/12/in-english-gatulanni-khilamaina.html
సూరి గారూ నెనరులు.పాట వినిన తరువాత మళ్ళీ కలుస్తాను.
అన్నమయ్య గురువందనం ఎంతైనా సముచితంగా ఉంది. అతను జన్మత: నందవరీక నియోగి బ్రాహ్మడు.స్మార్తుడు.శైవుడు. మరి వేంకటేశుని ప్రియభక్తుడుకాన ఆ స్వామే వైష్ణవగురువును పంపి శిష్యునికి (అభయ)ముద్రను ధరింపజేశాడు.
ఎన్డీయే సూరి గారికి
పాట విన్నాను.చాలా బాగుంది.బ్లాగుతో లంకె వేసి బ్లాగు చదువుతూ పాట వినగలిగేలా చేయటం ఎలానో తెలియటం లేదు.
Post a Comment