|
బౌళి
ఎంత మాత్రమున నెవ్వరుఁ దలచిన అంతమాత్రమే నీవు
అంతరాంతరము లెంచి చూడఁ బిండంతే నిప్పటి యన్నట్లు. IIపల్లవిII
కొలుతురు మిము వైష్ణవులు కూరిమితో విష్ణుఁడని
పలుకుదురు మిము వేదాంతులు పరబ్రహ్మం బనుచు
తలఁతురు మిము శైవులు తగిన భక్తులును శివుఁ డనుఁచు
అలరి పొగడుదురు కాపాలికులు ఆదిభైరవుఁడనుచు. IIఎంతII
సరి నెన్నుదురు శాక్తేయులు శక్తిరూపు నీ వనుచు
దరిశనముల మిము నానా విధులను తలఁపులకొలఁదుల భజింతురు
సిరుల మిమ్మునే యల్పబుద్ధిఁ దలచినవారికి నల్పం బవుదువు
గరిమల మిము నే ఘనమని తలఁచిన ఘనబుద్ధులకు ఘనుడవు. IIఎంతII
నీ వలనఁ గొరతే లేదు మరి నీరుకొలఁది తామెరవు
ఆవల భాగీరథి దరిదాపుల ఆ జలమే వూరినయట్లు
శ్రీవేంకటపతి నీవైతే మముఁ జేకొనివున్న దైవమని
యీవల నే నీ శరణనియెదను యిదియే పరతత్వము నాకు. IIఎంతII ౨-౩౯౩
ఎవరు ఎంతమాత్రము తలిస్తే వారికి నీవు అంతమాత్రముగానే కనిపిస్తావు.అంతరాంతరాలలో ఎంచి చూస్తే నిప్పట్లు(ఆకులు పైన నిప్పులు వేసి కాల్చే అట్లు)లో ఉన్న బియ్యప్పిండి మాదిరే యన్నట్లే.
వైష్ణవులు మిమ్ము విష్ణుడవని ప్రేమతో కొలుస్తారు.వేదాంతులు మిమ్ము పరబ్రహ్మమని అంటారు.శైవులు,తగిన యితర భక్తులు మిమ్ము శివుడవని తలుస్తారు.కాపాలికులు సంతోషముతో మిమ్ము ఆదిభైరవుడవని పొగడుతారు.శాక్తేయులు మిమ్ము శక్తి రూపమని సరిగ్గా ఎన్నుకుంటారు. ఇలా ఎవ్వరి తలపులనుబట్టి వారు వారు తమకిష్టమైన రూపాలలో మిమ్ము పూజిస్తే వారివారికి కావాల్సిన రూపాల్లో దర్శనములను ఇస్తావు.అల్పబుద్ధులకు అల్పంగాను, నిన్ను ఘనమైనవాడవని తలచిన ఘనబుద్ధులైన వారికి ఘనుడవు గాను దర్శనమిస్తావు.నీ వలన కొరతేమీ లేదు.నీవు నీటికొలది తామర వంటివాడవు.అక్కడ గంగానది ఒడ్డున నున్న బావులలో ఆ గంగా జలమే ఊరినట్లుగా శ్రీ వేంకటపతివి నీవైతే,మమ్ము చేకొని ఉన్నదైవమవని నిన్ను ఇక్కడ శరణని అంటాను.ఇదియే నాకు పరతత్వము.
7 comments:
పిండంతే నిప్పట్టు. ఈ పలుకుబడి వింటే చాలు. ఆనందం కలిగింది. రాయలసీమలో బియ్యప్పిండితో చేసే నిప్పట్లు బాగా ప్రాచుర్యం. అన్నమయ్య అమ్మ చేసిన కమ్మని నిప్పట్లు తిని పెరిగినవాడే. తనపాట పరబ్రహ్మ స్వరూపమే. అది తాకని వస్తువు కాని చేరని చోటుగానీ లేదు. నెనరులు.
Sir,
I have posted two songs with esnips link attached to it. Please visit esnips.com, search your song, if you find your song, play it, copy the URL.
While posting your Song, there will be a hyperlink sign on the top of posting window, click on it, and a small window opens. Paste the URL there. And you can play your song there.. Meaning, anyone who reads your post, will automatically be able to listen to the song, by clickin on the link provided by you.
I hope you got my idea. If you still have any doubts, you can contact telugu blog group in google.. or just ask help to Mr.Veeven / Mrs. Jyoti valaboju either on their blogs or just mail them.
Hope your blog will be extensively useful to people who have a liking for annamayya's kirtanas. Good Going.
I wonder if you teach music ?!
@తెలుగు అభిమాని గారికి
నెనరులు.పిండంతే నిప్పటి గురించి తెలిపినందుకు.
@సుజాత గారూ నెనరులు.మీరిచ్చిన వివరాలకు ధన్యవాదాలు.వాటిని గురించి తెలుసుకొని పాటలను లింకు చెయ్యడానికి ప్రయత్నించి చూస్తాను.తరువాత మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను.నేను సంగీతం వినటమే కాని దానిలో ఓనమాలు కూడా నాకు తెలియవు.నా స్వరం గార్ధభస్వరానికి దగ్గరగా వుంటుంది.
వివరణ బాగుందండి. అన్నమయ్య పదాలు అచ్చ తెలుగుదనాన్ని తేనెలో ముంచి తీసినంత తియ్యగా...
మాటనేర్పూ ,భావుకత్వం పాలూతేనెల్లా కలగలిసిన మధురామృతం.ఆయన కీర్తనల్లో భక్తి ఉంది ,రక్తి ఉంది,తత్వం ఉంది,తన్మయత్వం ఉంది స్వామికి తనను తాను అర్పించుకొన్న ఆర్తి ఉంది.
విజయమోహన్ గారికి మీరన్నది అక్షరాలా నిజం.నెనరులు
Ayyo ! Sir, Its great to have such a nice taste about annamayya. I wish I learn Carnatic Music. I love music. Y dont you try an insturment ? It feels great ! I play guitar. I feel so happy and content while playing.
మీరు గిటార్ వాయించుతారా.చాలాసంతోషం.అన్నమయ్య కీర్తనలను గిటారు మీద ట్రై చేయండి.వీలైతే ఎప్పుడైనా వినిపించండి.ఆనందిస్తాము అందరమూ.సంగీత జ్ఞానం బొత్తిగా లేదు.వినడమే వచ్చు.హైపర్లింకు చేయడం ఇంకా రాలేదు.ట్రై చేస్తున్నాను.
Post a Comment