లలిత
అంతర్యామీ అలసితి సొలసితి
ఇంతట నీ శర ణిదే చొచ్చితిని. IIపల్లవిII
కోరినకోర్కులు కోయనికట్లు
తీరవు నీవవి తెంచకా
భారపుఁబగ్గాలు పాపపుణ్యములు
నేరుపులఁ బోవు నీవు వద్దనకా. IIఅంతII
జనుల సంగములఁ జక్కరోగములు
విను విడువవు నీవు విడిపించకా
వినయపుదైన్యము విడువనికర్మము
చనదది నీవిటు సంతపరచకా. IIఅంతII
మదిలో చింతలు మయిలలు మణుఁగులు
వదలవు నీవవి వద్దనకా
యెదుటనె శ్రీవేంకటేశ్వర నీ వదె
అదనఁ గాచితివి అట్టిట్టనకా. IIఅంతII ౨-౪౭౫
నాలో వుండే ఓ పరమాత్మా! అలసిపోయాను, మూర్ఛపోతున్నాను.ఇంతలో నిన్నిదే శరణు కోరుచున్నాను.
నేను కోరిన కోరికలు నా శరీరాన్ని బంధించే కోయకవున్న తాళ్ళు. నీవు వాటిని తెంచకుండా అవి తెగవు.
నే జేసిన పాపపుణ్యాలు భారమైన పగ్గాల వంటివి.అవి నీవు వద్దనకపోతే నా సామర్ఢ్యముతో తెగిపోవు.
జనుల సంసర్గముల వలని కలిగే రోగములు, వినవయ్యా! నీవు విడిపించక అవి విడిచిపోవయ్యా.
వినయంతో కూడిన దైన్యమూ,విడిచి పెట్టకుండా తనతోనే ఉండే కర్మమూ నీవిటు వొద్దికచేయక(లేక శాంతపరచక) నన్ను విడిచి వెళ్ళవయ్యా.
నా మదిలోని చింతలూ,నా దగ్గరి మైలలూ,మణుగులకొలదీ వున్నవి నీవు వద్దనక అవి నన్ను వదలవు.
అటూ ఇటూ అనకుండా ఓ శ్రీవేంకటేశ్వర నీవు నా యెదురుగా వుండి నన్ను అదనులో కాచి రక్షించావయ్యా.
Jul 24, 2008
అంతర్యామీ అలసితి సొలసితి
Posted by
Unknown
Subscribe to:
Post Comments (Atom)
6 comments:
thank you sir
bollojubaba
వివరణ బాగుంది.
నెనరులు
ఎన్నో సార్లు విన్నాను గానీ, ఇంత గూడార్ధం వుందని ఇప్పుడే తెలిసింది. నెనరులు.
ఆహా! ఎంత చక్కని పాట. అన్నమయ్య సంపూర్ణ శరణాగతి చెందటం చక్కగా ఆవిష్కృతమయ్యింది. మీ వివరణకు నెనరులు. బాలు గొంతులో శివరంజనిలో ఈ పదం మనసును ద్రవింపజేస్తుంది.
తెలుగు అబిమాని గారికి -నెనరులు
Post a Comment